పట్టు సడలించని మహమ్మారి
close
పట్టు సడలించని మహమ్మారి

అమెరికాలో 24 గంటల్లో 2,494 మంది మృతి
అగ్రరాజ్యంలో 10 లక్షలకు చేరువగా కేసులు
పలు రాష్ట్రాల్లో ఆంక్షల సడలింపు ప్రక్రియకు ఊపు
బ్రిటన్‌లో 20 వేలు దాటిన మరణాలు

వాషింగ్టన్‌, ఢాకా: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఆ దేశంలో వైరస్‌ దెబ్బకు 24 గంటల వ్యవధిలో 2,494 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 54 వేలు దాటింది. దేశవ్యాప్తంగా వైరస్‌ బాధితుల సంఖ్య 10 లక్షలకు చేరువైంది. మరోవైపు, వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో నిషేధాజ్ఞల సడలింపు ప్రక్రియ ఊపందుకుంటోంది. పలు రాష్ట్రాల్లో ఆంక్షలను ఈ వారంలోనే పాక్షికంగా ఎత్తివేయనున్నారు. టెన్నెస్సీలో సోమవారం నుంచి రెస్టారెంట్లు తెరుచుకోనున్నాయి. మిస్సౌరీలో ఈ వారం దాదాపుగా అన్ని వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇడహోలో ప్రార్థనా స్థలాల్లోకి ప్రజలను అనుమతించనున్నారు. సెలూన్లు, స్పాలను తెరిచేందుకు జార్జియా, ఒక్లహామా అనుమతించాయి. అలస్కాలోనూ రెస్టారెంట్లు తెరుచుకోనున్నాయి. ఇప్పటికే పలు బీచుల్లో కోలాహలం కనిపిస్తోంది. రిపబ్లికన్‌ గవర్నర్ల నేతృత్వంలోని రాష్ట్రాలు కీలక రంగాలను పునరుద్ధరించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నాయి.

డెమోక్రాటిక్‌ నేతలు గవర్నర్లుగా ఉన్న రాష్ట్రాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కరోనా ఉద్ధృతికి కుదేలైన న్యూయార్క్‌లో ప్రస్తుతానికి సడలింపుల దిశగా అడుగులు పడట్లేదు. హవాయిలో జనం ఇళ్లను విడిచి బయటకు రాకుండా విధించిన ఆంక్షలను వచ్చే నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు గవర్నర్‌ డేవిడ్‌ ఇగె ప్రకటించారు.

తొందరపాటు వద్దు: ఫౌచీ
ఆంక్షల ఎత్తివేతకు తొందరపాటు తగదని అమెరికాలో అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ హితవు పలికారు. తిరిగి సాధారణ పరిస్థితులను నెలకొల్పాలన్న కోరిక అర్థం చేసుకోతగినదేనని ఆయన పేర్కొన్నారు. అయితే- వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోకి రాక ముందే ఆంక్షలను ఎత్తివేస్తే.. పరిస్థితులు ఎప్పటికీ సాధారణ స్థితికి చేరుకోలేవని హెచ్చరించారు.

ఆరోగ్య మంత్రిపై వేటు?
అమెరికా ఆరోగ్యం, మానవ సేవల మంత్రి అలెక్స్‌ అజర్‌పై వేటు వేయాలని దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తాజాగా పలు వార్తాసంస్థలు కథనాలను ప్రచురించాయి. దేశంలో తొలినాళ్లలోనే వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో అలెక్స్‌ విఫలమయ్యారని ప్రభుత్వం భావిస్తున్నట్లు అందులో పేర్కొన్నాయి. ఈ వార్తలను శ్వేతసౌధ అధికార ప్రతినిధి జుడ్‌ డీరె కొట్టిపారేశారు.

స్పెయిన్‌లో చిన్నారుల ఆనంద హేల
చిన్నారుల కేరింతలతో ఆదివారం స్పెయిన్‌ హోరెత్తింది. 44 రోజుల నిర్బంధ ఆంక్షల అనంతరం తొలిసారిగా ఆ దేశంలో ఇళ్లను వదిలి బయటకు వచ్చేందుకు చిన్నారులను అనుమతించారు. దీంతో పిల్లలు వీధుల్లోకి వచ్చి ఆనందంగా ఆడిపాడారు. కొందరు సైకిళ్లు, మోటారు సైకిళ్లపై దూసుకెళ్తూ హుషారుగా కనిపించారు.

బంగ్లాదేశ్‌లో 31 మంది ఇస్కాన్‌ సభ్యులకు కరోనా
బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని ఇస్కాన్‌ ఆలయానికి చెందిన 31 మంది సభ్యులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వారందరినీ విడిగా ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాస్తవానికి గత నెల 8 నుంచి ఆలయంలోకి రాకపోకలను నిలిపివేశామని, అయినా అందులోని వ్యక్తులు వైరస్‌ బారిన పడటం తమను ఆశ్చర్యానికి గురిచేస్తోందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో ఇప్పటివరకు ఐదు వేలమందికిపైగా వైరస్‌ సోకింది. 145 మంది మరణించారు. బంగ్లాదేశ్‌లో లాక్‌డౌన్‌ను ధిక్కరిస్తూ వందలాది వస్త్ర కర్మాగారాలు ఆదివారం తెరుచుకున్నాయి. ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించాయి. అయితే- దాదాపుగా అన్ని కర్మాగారాల్లో పరిమిత సంఖ్యలో మాత్రమే కార్మికులు విధులకు హాజరయ్యారు.

ఆఫ్రికాలో 30 వేలు దాటిన కేసులు
ఆఫ్రికా ఖండంలోని 54 దేశాల్లో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 30 వేలు దాటింది. మృతుల సంఖ్య ఇప్పటివరకు 1,374గా నమోదైంది. లెసొథో, కొమొరొస్‌ మినహా అన్ని ఆఫ్రికా దేశాలకు వైరస్‌ పాకింది.

సామూహిక ప్రార్థనలు వద్దు
పాకిస్థాన్‌లో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. ఆదివారం 1,508 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13 వేలు దాటింది. వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని రంజాన్‌ మాసంలో సామూహిక ప్రార్థనలకు దూరంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వ అధికారులు, వైద్య నిపుణులు విజ్ఞప్తి చేశారు. మసీదులకు వెళ్లకుండా ఇళ్లలోనే ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు. పాక్‌లో కొవిడ్‌ దెబ్బకు ఇప్పటివరకు 269 మంది మృతిచెందారు.

రష్యాలో వైద్యుల పర్యవేక్షణలో 1.73 లక్షల మంది
రష్యాలో కరోనా సోకినట్లు అనుమానాలున్న 1.73 లక్షల మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సమాచారం. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 28 లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అధికారిక గణాంకాల ప్రకారం రష్యాలో ఇప్పటివరకు 80 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 700 మందికిపైగా మరణించారు.
* సింగపూర్‌లో వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా ఆ దేశంలో 931 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇందులో అత్యధిక మంది బాధితులు విదేశీ కార్మికులే. మొత్తం కేసుల సంఖ్య 13 వేలు దాటింది.
* కరోనా కేసులు ఇజ్రాయెల్‌లో 15 వేలు, జపాన్‌లో 14 వేలు దాటాయి.
* బ్రిటన్‌లో మరణాల సంఖ్య 20 వేలు దాటింది. ఆదివారం ఆ దేశంలో 413 మంది మరణించారు. గత నెలరోజుల్లో బ్రిటన్‌లో మృతుల సంఖ్య ఇంత తక్కువగా నమోదవడం ఇదే తొలిసారి.
* దక్షిణ కొరియాలో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. తాజాగా అక్కడ 10 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో 20 కంటే తక్కువ కేసులు నమోదు కావడం ఇది వరుసగా తొమ్మిదో రోజు.
* ఇండోనేసియాలో కొత్తగా 275 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,882కు పెరిగింది. వైరస్‌ దెబ్బకు ఆదివారం 23 మంది మరణించారని, దీంతో మృతుల సంఖ్య 743కు పెరిగిందని అధికారవర్గాలు వెల్లడించాయి.
* కొవిడ్‌ నుంచి కోలుకున్న బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ సోమవారం నుంచి అధికారిక విధులకు హాజరు కానున్నారు.
* లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ జర్మనీ రాజధాని బెర్లిన్‌లో పలువురు రోడ్డెక్కారు. ఆందోళన నిర్వహించారు. డజన్లకొద్దీ నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

మరిన్ని