కరోనా కోరల్లో గల్ఫ్‌
close
కరోనా కోరల్లో గల్ఫ్‌

సౌదీలో 139 మరణాలు
యూఏఈలో 76 మంది మృతులు
ఖతర్‌లోనూ వైరస్‌ విజృంభణ
స్థానికులకే తప్ప ప్రవాసులకు అందని సాయం
తెలంగాణ, ఏపీలోని పలు కుటుంబాల్లో ఆందోళన
ఈనాడు, హైదరాబాద్‌

వారంతా నిరుపేదలు.. ఉన్న ఊరిని.. అయినవారిని వదిలి.. పొట్ట కూటి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు.. నాలుగు రాళ్లు సంపాదించుకుని కుటుంబ కష్టాలు తీరుద్దామనుకున్న వారి ఆశలను కరోనా అడియాసలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది గల్ఫ్‌ దేశాల్లో పనుల్లేక.. చేతిలో చిల్లిగవ్వ లేక.. ఆకలితో అల్లాడుతున్నారు.. కొందరు వైరస్‌ బారిన పడి వైద్య సహాయం అందక అర్థిస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు స్థానికులనే తప్ప.. ప్రవాసులను పట్టించుకోవడంలేదు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బాధిత కుటుంబాలలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

గల్ఫ్‌ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, కువైట్‌, ఒమన్‌, ఖతర్‌, బహ్రెయిన్‌లలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సౌదీలో కేసుల సంఖ్య 17 వేలు దాటగా, యూఏఈ, ఖతర్‌ దేశాల్లో ఒక్కోచోట 10 వేల మందికి పైగా ఇది సోకింది. గల్ఫ్‌ దేశాల్లో వ్యాధి ఉద్ధృతితో అక్కడి ప్రవాస భారతీయులు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ దేశాల్లో 25 లక్షల మంది వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారున్నారు. ఆయా దేశాల్లో స్థిరపడిన వారే గాక తాత్కాలిక వీసాలపై వెళ్లినవారు అక్కడ పనిచేస్తున్నారు. గల్ఫ్‌ దేశాల్లో చమురు కంపెనీలు, గ్యాస్‌ స్టేషన్లు, నిర్మాణ సంస్థలు, హోటళ్లు, పర్యాటక ప్రాజెక్టులు, ఐటీ పరిశ్రమలు, రోడ్‌వేస్‌, ప్యాకింగ్‌, తదితరచోట్ల పనిచేసేవారు. కరోనాతో ఆయిల్‌ కంపెనీలను మూసివేశారు. నిర్మాణాలు నిలిచిపోయాయి. ఐటీ పరిశ్రమలు ఇంటి నుంచే పనిచేయాలనే నిబంధనలు విధించాయి. పర్యాటక రంగం వెలవెలబోయింది. రంజాన్‌ మాసం అతి ముఖ్యమైనది కాగా యూఏఈలో కొద్దిమేరకు ఆంక్షలు సడలించగా మిగిలిన దేశాలు కర్ఫ్యూను కొనసాగిస్తున్నాయి. కువైట్‌ కర్ఫ్యూ వేళలను మరింతగా పెంచింది.

ప్రవాసుల అగచాట్లు
గల్ఫ్‌ దేశాల్లోని సౌదీలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆయా దేశాల్లో ఇప్పటి వరకు వైరస్‌ బారిన పడి మరణించిన వారిలో 25 మందికి పైగా భారతీయులు ఉన్నారు. ఇందులో కేరళకు చెందిన వారు ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా నిజామాబాద్‌కు చెందిన ఒకరి పేరు మాత్రమే కువైట్‌లో నమోదైంది. సౌదీ, యూఏఈలలోని ప్రవాసుల్లో ఎక్కువమంది దీని బారిన పడ్డట్లుగా చెబుతున్నారు. భారత్‌లో కరోనా వ్యాధిగ్రస్తుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపి చికిత్స అందిస్తోంది. గల్ఫ్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రవాసులను అక్కడి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. సాధారణ ఆసుపత్రుల్లో మాత్రమే చికిత్స జరుగుతోంది. కార్మిక క్షేత్రాల్లో ఎక్కువ మంది నివసిస్తున్నారు. వారిని వేర్వేరుగా తరలించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించడం లేదు. ప్రవాసులకు పనులు లేకపోవడంతో నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా ఉన్న సంస్థలు మినహాయిస్తే ప్రభుత్వం నుంచి సాయం శూన్యమే.


భయంగా జీవిస్తున్నాం

లాక్‌డౌన్‌ వల్ల ఇక్కడ చిక్కుకుని పోయాం. ఒక్కోచోట చాలామందిమి కలిసి గదుల్లో ఉంటున్నాం. కరోనా వస్తే మా పరిస్థితి ఏమిటనే భయం నెలకొంది. ఇక్కడి అధికారులు మా వంక చూడటం లేదు. మేం ఇక్కడి నుంచి వెళ్లడానికి అవకాశం లేదు. ఊళ్లల్లోని మా వాళ్లు కంగారు పడుతున్నారు.

- భాస్కర్‌, సౌదీ అరేబియా


స్వదేశానికి పంపించాలి

కరోనా వల్ల మాకు ప్రమాదం ఉంది. మమ్మల్ని స్వదేశానికి పంపించాలి. లేకపోతే ఇక్కడి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పలేకుండా ఉంది. ఏం చేయాలో తోచడంలేదు. క్షమాభిక్ష సమయంలో మాదిరిగా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తే అందరం మా ఊళ్లకు వెళ్లిపోతాం.

-మురళి, యూఏఈ


అందరిలో ఆందోళన

కువైట్‌లో కేసులు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కర్ఫ్యూ ఉన్నా.. వ్యాధి విస్తరిస్తోంది. విదేశాల్లో ఉన్న కువైట్‌ వారు స్వదేశానికి వస్తున్నారు. దీంతో వైరస్‌ మరింత ప్రబలే ప్రమాదముంది. ప్రవాస కార్మికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రాయబార కార్యాలయ అధికారులను కోరుతున్నాం. దీనికి కువైట్‌ ప్రభుత్వం అనుమతించడం లేదు.

-అభిలాష, కువైట్‌

Tags :

మరిన్ని