కుదుటపడుతున్న న్యూయార్క్‌
close
కుదుటపడుతున్న న్యూయార్క్‌

న్యూజెర్సీలోనూ కొంతమేరకు ఉపశమన ఛాయలు
గణనీయంగా తగ్గిన మరణాలు

న్యూయార్క్‌: అమెరికాలో కొవిడ్‌ దెబ్బకు ఎక్కువగా కుదేలైన న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాల్లో కొంతమేరకు ఉపశమన ఛాయలు కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ కొత్త మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. న్యూయార్క్‌లో సోమవారం 337 మంది మృత్యువాతపడ్డారు. గత నెల రోజుల్లో ఆ రాష్ట్రంలో ఒక్కరోజులో చోటుచేసుకున్న అత్యల్ప మరణాలు ఇవే. న్యూజెర్సీలో తాజాగా 106 మంది కన్నుమూశారు. ఇటీవల ఈ రాష్ట్రాల్లో కొవిడ్‌ ఉద్ధృతి గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు ఒక్కోరోజు ఇంతకంటే రెట్టింపు స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. పరిస్థితులు కొంత మెరుగుపడ్డప్పటికీ నిషేధాజ్ఞల సడలింపు విషయంలో తాము తొందరపడబోమని న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే నెల 15 తర్వాత కూడా ఆంక్షలను కొనసాగిస్తామన్నారు. వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం నిర్మాణ, ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. వేసవిలో పాఠశాలలను నడిపే విషయంపై న్యూజెర్సీ, కనెక్టికట్‌ గవర్నర్లతో సమాలోచనలు జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు. జూన్‌ నెలాఖర్లోగా పాఠశాలలను తిరిగి తెరుస్తామని న్యూజెర్సీ గవర్నర్‌ ఫిలిప్‌ ముర్ఫీ ఆశాభావం వ్యక్తం చేశారు.


చైనా నుంచి భారీ నష్టపరిహారం వసూలుపైనే మా దృష్టి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

వాషింగ్టన్‌: చైనా నుంచి భారీగానే నష్టపరిహారం పొందే విషయంపై దృష్టి సారిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. ఆయన శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడుతూ చైనా విషయంలో తమ దర్యాప్తు చాలా సీరియస్‌గా జరుగుతోందన్నారు. జర్మనీ నష్టపరిహారం కింద 130 బిలియన్ల యూరోలు కోరుతోందన్న విషయం ఆయన దృష్టికి తీసుకురాగా తాము అంత కంటే ఎక్కువ పరిహారాన్ని రాబట్టడంపై యోచిస్తున్నామని సమాధానమిచ్చారు. ‘కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనాను బాధ్యురాలిగా చేసేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. చైనా విషయంలో సంతృప్తిగా లేము’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని