ఇంకా భయం గుప్పిట్లోనే..
close
ఇంకా భయం గుప్పిట్లోనే..

లాక్‌డౌన్‌ను ఎత్తివేసినా పెద్దగా బయట తిరగట్లేదు
వుహాన్‌లో తాజా పరిస్థితులను వివరించిన భారతీయులు

బీజింగ్‌, వుహాన్‌: కరోనా మహమ్మారి పుట్టుకకు కేంద్రంగా నిలిచిన వుహాన్‌ నగరంలో సుదీర్ఘంగా 76 రోజులపాటు సాగిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసినప్పటికీ ప్రజలు స్వేచ్ఛగా బయట తిరగలేకపోతున్నారని అక్కడి భారతీయులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించనప్పటికీ కొవిడ్‌ పాజిటివ్‌గా తేలుతున్న వ్యక్తుల (అసింప్టమాటిక్‌ కేసులు) సంఖ్య నానాటికీ పెరుగుతుండటమే ఇందుకు కారణమని వారు వివరించారు. మహమ్మారి మరోసారి విజృంభించేందుకు ఇలాంటి కేసులు కారణమయ్యే ముప్పుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యాలయాలకు వెళ్లేందుకు, నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు మాత్రమే జనం బయటకు వస్తున్నారని.. మిగతా సమయాల్లో ఇళ్లకే పరిమితమవుతున్నారని తెలిపారు.

వుహాన్‌లో ఇప్పటివరకు 50,333 కరోనా కేసులు నమోదయ్యాయి. 3,869 మంది మరణించారు. అక్కడి ఆస్పత్రుల్లో ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య సున్నా. చైనాలో ఇప్పటివరకు 997 అసింప్టమాటిక్‌ కేసులు నమోదు కాగా, అందులో 599 హుబెయ్‌ ప్రావిన్సులోనివే. ఆ ప్రావిన్సుకు రాజధాని వుహాన్‌. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వుహాన్‌ నుంచి 600 మందికిపైగా భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చింది. మరికొంతమంది వృత్తిపరమైన, వ్యక్తిగత కారణాలతో అక్కడే ఉండిపోయారు. వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 8న నగరంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో అక్కడి తాజా పరిస్థితులను కొంతమంది భారతీయులు ‘పీటీఐ’ వార్తాసంస్థకు ఫోన్‌ ద్వారా వివరించారు. ‘‘లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో జనం బయటకు వస్తున్నారు. అయితే అది అత్యవసర పనుల కోసం, నిత్యాసరాల కొనుగోలు కోసం మాత్రమే. అసింప్టమాటిక్‌ కేసుల భయంతో అత్యధికమంది ఇళ్లకే పరిమితమవుతున్నారు’’ అని వుహాన్‌లోని భారతీయ పరిశోధకుడొకరు చెప్పారు. ‘‘అసింప్టమాటిక్‌ కేసుల కారణంగా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. బయటకు వెళ్తే మనకు ఎవరు ఎదురుపడతారో తెలియదు. వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో చెప్పలేం. అందుకే పనులు ముగించుకున్న వెంటనే జనం ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇంకెక్కడా తిరగట్లేదు’’ అని మరొకరు వివరించారు.

భారత్‌లో పరిస్థితులను గమనిస్తున్నాం
భారత్‌లో వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండటంతో తమ కుటుంబ సభ్యుల పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నట్లు మరొకరు చెప్పారు. ‘‘జనవరి, ఫిబ్రవరి, మార్చిలో నా పరిస్థితి గురించి భారత్‌లో నా కుటుంబం బాధపడింది. ఇప్పుడు వారి గురించి నేను ఆందోళన చెందుతున్నా. భారత్‌లో వైరస్‌ వ్యాప్తి గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నాం’’ అని వివరించారు.

ముమ్మరంగా పరీక్షలు
వుహాన్‌లో పరిస్థితులు మెరుగుపడ్డప్పటికీ.. భౌతిక దూరం, ఇతర శుభ్రతా ప్రమాణాలను ప్రజలు ఇప్పటికీ పాటిస్తున్నారని మరో భారతీయ పరిశోధకుడు చెప్పారు. కరోనా బాధితులను, ముఖ్యంగా అసింప్టమాటిక్‌ కేసులను గుర్తించేందుకు న్యూక్లిక్‌ ఆమ్ల పరీక్షలను అధికారులు ముమ్మరం చేశారని పేర్కొన్నారు.

Tags :

మరిన్ని