స్వీడన్‌ రూటే సపరేటు
close
స్వీడన్‌ రూటే సపరేటు

 లాక్‌డౌన్‌ లేకుండా కరోనాపై పోరు
 ఫలితం ఇస్తుందా, ప్రమాదం తెస్తుందా?

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ తలుపులు బిడాయించి కూర్చుంటే.. ఐరోపాలోని స్వీడన్‌ మాత్రం లాక్‌డౌన్‌ విధించకుండా ఆశ్చర్యపరుస్తోంది. వైరస్‌ ఆనవాళ్లు కనిపించిన ఆరంభం నుంచే ప్రజల్ని చైతన్యపరిచి.. కట్టడి చేయాల్సిన బాధ్యతను వారికి సైతం అప్పగించింది. కఠిన నిర్బంధాలేవీ విధించలేదు. ప్రజారవాణా నిరాటంకంగా నడుస్తోంది. యువత అధికంగా ఉండే కళాశాలలను మూసేయగా... చిన్నపిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు. ప్రభుత్వ ప్రమేయం లేని ప్రజారోగ్య సంస్థ స్వతంత్రంగా, చురుగ్గా పనిచేస్తోంది. ప్రజలే స్వచ్ఛంద నిర్బంధాన్ని పాటిస్తున్నారు. ఈ విధానం ప్రమాదకరమని హెచ్చరికలు వస్తున్నా.. మా వ్యూహాలు మాకున్నాయని ధీమాగా  చెబుతోంది. ఈ అంశంపై విశాఖపట్నానికి చెందిన   డాక్టర్‌ వేమూరి కృష్ణమూర్తి విశ్లేషణ ప్రకారం...

అంతా స్వచ్ఛందమే!
ఇతర ఐరోపా దేశాలకు భిన్నంగా స్వీడన్‌లో చాలావరకు స్వచ్ఛంద కట్టడి చర్యలే ఉన్నాయి. లాక్‌డౌన్‌ విధించకపోయినా చాలావరకు ప్రజలే స్వీయ నిర్బంధం పాటిస్తుండటంతో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పిలుపుతో కరోనా రోగులకు సేవలందించేందుకు 5 వేలకు పైగా వాలంటీర్లు ముందుకొచ్చి ఆస్పత్రుల్లో చేరారు. కరోనా కట్టడిలో మొదటి నుంచి ప్రజలపైనే నమ్మకం ఉంచడం మంచిదే అయినా.. కొందరు సూచనలు పాటించరని, సమస్య అంతా అలాంటి వారితోనేనన్న విషయాన్ని గుర్తించాలని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. విద్యా సంస్థలను మూసినా 16 ఏళ్ల లోపు పిల్లల పాఠశాలలు నడుస్తుండటాన్ని ప్రశ్నిస్తున్నారు.
* స్వీడన్‌ పొరుగు దేశాలైన నార్వే, ఫిన్లాండ్‌, డెన్మార్క్‌లు కరోనా నియంత్రణకు గట్టి చర్యలే తీసుకున్నాయి.  వీటితో పోలిస్తే భిన్నంగా వ్యవహరిస్తున్న స్వీడన్‌లోనే కేసులు, మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఇవన్నీ చూసి ప్రజలను కట్టడి చేయకుండా ప్రమాదకర విధానం అవలంభిస్తున్నారన్న విమర్శలు ఎక్కువయ్యాయి.

 

ప్రజారోగ్య సంస్థకే నిర్ణయాధికారం
ప్రజారోగ్యానికి విపత్తు వచ్చినప్పుడు స్వీడిష్‌ రాజ్యాంగం ప్రకారం ప్రధాని, పాలకవర్గం నిర్ణయాలు నామమాత్రమవుతాయి. ఆరోగ్యరంగ నిపుణులతో ఏర్పాటైన ప్రజారోగ్య సంస్థనే కీలకమవుతుంది. దీనికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఈ సంస్థ సూచనలే ప్రభుత్వం అమలుచేయాలి. ఈ సంస్థకు చెందిన ప్రధాన నిపుణుడు అండర్స్‌ తెగ్నల్‌కు దేశీయంగా విశేష అభిమానముంది. ఇప్పుడు ఆయన నిర్ణయాలే కీలకమవుతున్నాయి. ఇదే సమయంలో అండర్స్‌ దేశంలో హెర్డ్‌ ఇమ్యూనిటీ పెంచే ప్రయత్నం చేస్తున్నారని, వ్యాక్సిన్లు రాకుండా అలాంటి ప్రయత్నం చేస్తే ప్రాణనష్టం తీవ్రంగా ఉంటుందన్న ఆందోళనలు ఉన్నాయి. తొలినాళ్లలో ఇలాంటి ప్రయత్నం చేసిన బ్రిటన్‌, నెదర్లాండ్స్‌లో మరణాలు భారీగా పెరిగిపోవడంతో తర్వాత పంథా మార్చుకున్నారని గుర్తు చేస్తున్నారు. అయితే తాము దీర్ఘకాలిక వ్యూహంతో వెళ్తున్నామని, అదే సమయంలో హెర్డ్‌ ఇమ్యూనిటీ తమ లక్ష్యాలకు విరుద్ధమేమీ కాదని అండర్స్‌ చెప్పారు. సుశిక్షుతులైన వైద్యులు తమ బలమన్నారు. ఇతని వాదనకు ఆదేశ ప్రజల్లో 85% మద్దతు పలుకుతున్నట్లు ఇటీవలి సర్వేలు వెల్లడించాయి.

ప్రభుత్వం ఏం చేస్తోంది
ఆస్పత్రుల్లో మాస్కులు, పీపీఈల కొరత తలెత్తగా ప్రభుత్వం సత్వరమే అందించగలిగింది. ఐసీయూ పడకలను 500 నుంచి 800కు పెంచింది. రైళ్లలో భౌతిక దూరం పాటించేలా తక్కువ టికెట్లు జారీ చేస్తోంది. రెస్టారెంట్లు, బార్లకూ నిబంధనలు విధించింది. వైరస్‌ ఇప్పటికే దేశంలోకి ప్రవేశించినందున సరిహద్దులు మూయాల్సిన పనిలేదని, ఇప్పుడు చేయాల్సింది వ్యాప్తిని తగ్గించడమేనంటోంది.


జనాభా: 1.03 కోట్లు
తొలి కేసు: జనవరి 31
సామాజికవ్యాప్తి దశ గుర్తింపు: మార్చి 9న స్టాక్‌హోమ్‌లో
తొలి మరణం: మార్చి 11
ఇప్పటివరకు కేసులు: 20,302
మృతులు: 2,462
దేశ ప్రజల వ్యక్తిగత ప్రవర్తన పైనే వైరస్‌ వ్యాప్తి ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే మేం చేపట్టిన చర్యల వల్ల దేశంలో ఒక్కసారిగా వైరస్‌ విజృంభించే అవకాశమే లేదు. ప్రతిఒక్కరు సొంత ఆరోగ్యం చూసుసుకోవడంతోపాటు ఇతరుల ఆరోగ్యాలకూ బాధ్యత వహించాలి.

- స్టీఫెన్‌ లోవెన్‌, స్వీడన్‌ ప్రధాని

 


పౌరుల జీవన, ఆర్థిక ప్రమాణాలు దెబ్బతినకుండా వైరస్‌ వ్యాప్తిని నిరోధించాలన్నది మా ప్రజారోగ్య వ్యవస్థ లక్ష్యం. కరోనా నియంత్రణకు సుదీర్ఘ ప్రణాళిక అవసరం. ప్రజలను నిర్బంధించడం కంటే అవగాహన కల్పించేందుకే ప్రాధాన్యమిచ్చాం. పని మాన్పించి రోజుల తరబడి ఇళ్లలో ఉంచాలనుకోవడం సరైన విధానం కాదు. ఇప్పుడు కాకుంటే రేపయినా అంతా బయటకు రావాల్సిందే.

-అండర్స్‌ తెగ్నల్‌, ప్రజారోగ్య సంస్థ రోగ విజ్ఞాననిపుణుడు
Tags :

మరిన్ని