
లాటరీలో ఎంపికైనా హెచ్1బీ వీసాలకు ఎదురుచూపులు
ధ్రువపత్రాల దాఖలుకు తెరచుకోని ద్వారాలు
ఈనాడు, హైదరాబాద్: సాఫ్ట్వేర్ రంగంలో అడుగుపెట్టిన వారంతా అమెరికాలో పని చేయాలని కలలు కంటుంటారు. అలాంటి వారి కలలపై కరోనా మబ్బులు అలముకున్నాయి. లాటరీ రూపంలో అదృష్టం వరించినా కరోనా రూపంలో దురదృష్టం వెంటాడుతోంది. రెండు నెలల నుంచి వారు ఎదురుచూపులు చూస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశం వస్తుందా? రాదా? అన్న స్పష్టత లేక సాఫ్ట్వేర్ యువత అంతర్మథనంలో కొట్టుమిట్టాడుతోంది. అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగ భూతంతోపాటు త్వరలో ఎన్నికలు జరగనుండటంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ తీరుగా స్పందిస్తారన్నది సందేహంగా ఉంది. హెచ్1బీ వీసాపై వెళ్లే వారంతా సాంకేతిక నిపుణులే. ఆ ఉద్యోగాలు భర్తీ చేసేంత సంఖ్యలో నిపుణులు అక్కడ లేరన్నది అక్షర సత్యం. ఇమిగ్రెంట్ వీసాదారులను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఇప్పటికే అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్1బీ నాన్ ఇమిగ్రెంట్ వీసా అయినప్పటికీ ఉద్యోగాలపై ఆ ప్రభావం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ తీవ్రతతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాయబార కార్యాలయాలన్నింటినీ అమెరికా మూసివేసింది.
రెండు నెలలుగా నిరీక్షణ
హెచ్1బీ దరఖాస్తుదారులను ఎంపిక చేయడానికి సాధారణంగా ఏప్రిల్‌లో లాటరీ తీస్తారు. ఈ దఫా ఆ ప్రక్రియను మార్చిలోనే పూర్తి చేశారు. సుమారు రెండున్నర లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకుంటే అందులో యాభైవేల మందికిపైగా ఎంపికయ్యారు. అనంతరం వారు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆమోదం పొందిన దరఖాస్తుదారులు జూన్, జులై నెలల్లో అమెరికా వెళతారు. 50 రోజులుగా లాక్‌డౌన్‌తో దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోయింది. అది ఎప్పుడు మొదలవుతుంది? లాటరీలో ఎంపికైన వారిలో అందరినీ తీసుకుంటారా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది. కరోనాతో అమెరికాలో ఇప్పటికే 2.4 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 3.5 కోట్లు దాటింది. గత దశాబ్దకాలంలో ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగిత 15.2 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో స్థానికులకు అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో హెచ్1బీ ఉద్యోగార్థులను పణంగా పెడతారా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది.
ఉద్యోగ గడువు పెరిగేనా?
సహజంగా జూన్, జులై నెలల్లో ఉద్యోగులు హెచ్1బీ వీసాపై అమెరికా వెళతారు. అలాంటిది ప్రస్తుతం మే నెల సగం గడిచింది. ఇప్పటి వరకు రాయబార కార్యాలయాలను ప్రారంభించలేదు. ఇప్పుడు దరఖాస్తుల ప్రక్రియను ఆరంభించినా కనీసం రెండు నుంచి మూడు నెలలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు వ్యవధిని పెంచుతారా? లేదా? అన్నది ప్రశ్నగా ఉంది. అమెరికాలో ఉండి హెచ్1బీ వీసా స్టాంపింగ్ కోసం భారతదేశం రావాల్సిన వారికి తొమ్మిది నెలలపాటు వెసులుబాటు కల్పించినా దరఖాస్తు చేసుకున్నవారికి ఇప్పటి వరకు ఎలాంటి వర్తమానం రాలేదు.
వార్తలు / కథనాలు
దేవతార్చన
- ‘బిడ్డలిద్దరూ శివపార్వతులు.. నేను కాళికను’
- అక్కాచెల్లెళ్ల మరణానికి ఆ నమ్మకమే కారణమా?
- దోచుకున్న నాలుగు గంటలకే దొరికేశారు
- RRR రిలీజ్.. ఇది అన్యాయం: బోనీకపూర్
- థాంక్యూ.. టీమ్ఇండియా అంటున్న లైయన్
- 21 ఏళ్లకే వ్యాపార పాఠాలు!
- వెజ్ బఫె రూ.500, నాన్‌వెజ్ బఫె రూ.700
- ముంబయిని కేంద్రపాలిత ప్రాంతం చేయండి
- అచ్యుతానందగిరి స్వామి దారుణ హత్య
- మదనపల్లె కేసు: రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు