close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
80లక్షలకు చేరువలో కేసులు!

  ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి
  అమెరికాలో పెరుగుతున్న కేసులు!
  పాక్‌ మాజీ ప్రధాని గిలానీకి పాజిటివ్‌

మాస్కో: కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో విజృంభిస్తూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 80 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌ వ్యాప్తి వేగాన్ని గమనిస్తే... మొత్తం కేసుల సంఖ్య ఒకట్రెండు రోజుల్లో 80 లక్షలు దాటిపోయే అవకాశముంది. మరోవైపు తాజాగా సుమారు 2,400 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో మహమ్మారి కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 4.30 లక్షలు దాటింది.
అమెరికాలో తాజాగా 25 వేల కేసులు!
లాక్‌డౌన్‌ ఎత్తివేత ఫలితంగా అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో 25,396 కొత్త కేసులు నమోదైనట్టు జాన్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయంలోని కరోనా వైరస్‌ రిసోర్స్‌ సెంటర్‌ వెల్లడించింది.
* పాకిస్థాన్‌ మాజీ ప్రధాని యూసుఫ్‌ రజా గిలానీ (67)కి కరోనా సోకింది. కొవిడ్‌-19 పరీక్షల్లో తన తండ్రికి పాజిటివ్‌ ఫలితం వచ్చిందని, ఇందుకు ఇమ్రాన్‌ఖాన్‌ సర్కారుకు ధన్యవాదాలంటూ గిలానీ కుమారుడు కాశీం ట్వీట్‌ చేశారు. పాక్‌లో తాజాగా 88 మరణాలు చోటుచేసుకోగా, మృతుల సంఖ్య 2,551కు చేరుకుంది. ఇక్కడ మొత్తం కేసులు 1.32 లక్షలు దాటాయి.
* సింగపూర్‌లో ఇప్పటివరకూ 40,197 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే 345 కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో కొందరు వివిధ దేశాలకు చెందిన కార్మికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
* చైనాలో మరోసారి కరోనా కలకలం రేగింది. బీజింగ్‌లో కొత్తగా ఆరుగురికి కరోనా సోకడంతో ఇక్కడున్న అతిపెద్ద హోల్‌సేల్‌ ఫుడ్‌ మార్కెట్‌ను మూసివేశారు. సమీపంలోని 11 నివాస సముదాయాలకు రాకపోకలను నిషేధించారు.
* అత్యధిక కేసులు నమోదైన తొలి ఐదు దేశాల్లో అమెరికా, బ్రెజిల్‌, రష్యా, భారత్‌ బ్రిటన్‌లు నిలిచాయి. కేసుల విషయంలో ఐదో స్థానంలోనూ, మరణాల విషయంలో 9 స్థానంలోనూ మన దేశం నిలిచింది.

Tags :

మరిన్ని