ఎస్పీబీ మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు
close
ఎస్పీబీ మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు

సింగపూర్‌: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూయడం సినీ ప్రపంచానికి తీరని లోటని ప్రముఖ నేపథ్య గాయని పి.సుశీల విచారం వ్యక్తం చేశారు. ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ వారి ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణలో భాగంగా అంతర్జాలం వేదికగా నిర్వహించిన ‘గాన గంధర్వునికి ఘననివాళి’ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సింగపూర్‌లో నివసిస్తున్న ఎస్పీబీ అభిమానులంతా కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో పి.సుశీల మాట్లాడుతూ.. ‘‘బాలు గారితో కలిసి నేను ఎన్నో వేల పాటలు పాడాను. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం సినీ ప్రపంచానికి తీరని లోటు’’ అని అన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. తాను 400కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించానంటే కారణం ఎస్పీబీ లాంటి అద్భుత గాయకులు ఉండటం వల్లే సాధ్యమైందన్నారు.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ ఎస్‌.గోపాలరెడ్డి, సినీ గేయ రచయిత భువనచంద్ర, మ్యూజికాలజిస్ట్ రాజా, నటుడు హర్షవర్దన్‌, గాయని సంధ్య జయకృష్ణ, వంగూరి చిట్టెన్ రాజు, వంశీ రామరాజు తదితరులు బాలసుబ్రహ్మణ్యంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా గాయనీ గాయకులు, మనో, సంధ్య జయకృష్ణ, విశ్వాత్ముల రవి తదితరులు ఆలపించిన పాటలు అలరించాయి. ఆధ్యాత్మిక వేత్త మధు ప్రాఖ్య, సుబ్బు వి.పాలకుర్తిల కవితాగానం ఆకట్టుకుంది.

పద్మజా నాయుడు, రవి కిరణ్, రాపోలు నందు, కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు రత్న కుమార్ తదితరులు గతంలో బాలసుబ్రహ్మణ్యం సింగపూర్‌ వచ్చిన సందర్భంగా ఆయనతో ఉన్న అనుభవాలను, అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘ముత్యాలముగ్గు’ నిర్మాత ఎంవీఎల్‌ కుమార్తె అనురాధ బాలుతో తన తండ్రికి ఉన్న అనుబంధాన్ని ఆడియో రూపంలో పంచుకున్నారు. ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ అధ్యక్షులు రత్న కుమార్ మాట్లాడుతూ.. ‘‘బాలు గారి పాటకు మరణం లేదు. వారు ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో సజీవంగా ఉంటారు. ఇది ఒక సంతాపసభలా కాకుండా ఆయన పాటకు పట్టం కడుతూ ఈ కార్యక్రమం నిర్వహించాం’’ అని కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి సాంకేతికంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా గణేశ్న రాధాకృష్ణ, రామాంజనేయులు, సుధాకర్ ఎంతో సహకరించారు.

Tags :

మరిన్ని