తాళి కట్టి.. వదిలిపెట్టి.. ఆస్ట్రేలియా వెళ్లిపోయిన భర్త
close
తాళి కట్టి.. వదిలిపెట్టి.. ఆస్ట్రేలియా వెళ్లిపోయిన భర్త

వెనక్కి రప్పించి అరెస్టు చేసిన పోలీసులు

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: నూరేళ్లు కలిసి జీవిస్తానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి.. ఓ యువతి మెడలో మూడు ముళ్లు వేసి ఆస్ట్రేలియా వెళ్లిపోయిన యువకుడిని నల్గొండ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఆ ప్రబుద్ధుడిని అక్కడి నుంచి రప్పించి విమానం దిగగానే అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన ఓ యువతి వివాహం గతేడాది ఆగస్టు 6న ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్‌లోని జీడిమెట్ల పద్మారావునగర్‌కు చెందిన మందుగుల సురేష్‌తో జరిగింది. పెళ్లి అయిన 15 రోజుల తర్వాత ఆస్ట్రేలియా బయలుదేరిన సురేష్‌ కొద్దిరోజుల్లో భార్యను అక్కడికి తీసుకెళతానని చెప్పాడు. అప్పటినుంచి అత్తగారింట్లో ఉన్న ఆ యువతిని ఆడపడుచు, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు. దీనిపై సురేష్‌కు ఆయన భార్య ఎన్నిసార్లు చెప్పినా స్పందన కొరవడింది. దీంతో బాధితురాలు నల్గొండ మహిళా పోలీస్‌స్టేషన్‌లో సీఐ రాజశేఖర్‌గౌడ్‌ను సంప్రదించారు. ఆయన నల్గొండ ఎస్పీ ఎ.వి.రంగనాథ్‌ ద్వారా ఆస్ట్రేలియా ఎంబసీ సహకారంతో సురేష్‌ పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ సంస్థకు మెయిల్‌ పెట్టారు. ఆ తర్వాత సంస్థ నిర్వాహకులకు ఫోన్‌లో విషయం వివరించి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించేలా చేశారు. అనంతరం సురేష్‌ భారత్‌ వచ్చేలా ఒత్తిడి తెచ్చారు. ఈనెల 2న దిల్లీ విమానాశ్రయంలో సీఐ రాజశేఖర్‌గౌడ్‌... ఇమ్రిగేషన్‌, విమానాశ్రయ అధికారుల సహకారంతో సురేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags :

మరిన్ని