
మంచు తుపాను ధాటికి వణుకుతున్న పలు రాష్ట్రాలు
టెక్సాస్, ఒక్లాహామా, టెన్నెసీ, ఇల్లినాయిస్లలో ప్రజల ఇక్కట్లు
20 మంది మృత్యువాత పడినట్లు అధికారుల అంచనా
హ్యూస్టన్: మంచు తుపాను ధాటికి అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. పలు రాష్ట్రాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. టెక్సాస్, ఒక్లాహామా, టెన్నెసీ, ఇల్లినాయిస్ రాష్ట్ర ప్రజలు మంచు తుపానుతో ఇక్కట్లు పడుతున్నారు. ఈ నెల 14 నుంచి ఇప్పటివరకు మంచు తుపానుకు దాదాపు 20 మంది మృతి చెందారని అధికారులు అంచనా వేస్తున్నారు. కొద్దిరోజులుగా తీవ్రమైన హిమపాతంతో ఉక్కిరిబిక్కిరవుతున్న టెక్సాస్‌లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల 40 లక్షల ఇళ్లు, దుకాణాలపై ప్రభావం పడింది. వ్యాపార వాణిజ్య సంస్థలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. మరోవైపు రక్తం గడ్డం కట్టించే చలిని ఎదుర్కొనే హీటర్లు పనిచేయక ప్రజలు అవస్థలు పడుతున్నారు. రహదారులు మంచుతో నిండిపోయిన పరిస్థితుల్లో అనేక మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. ‘‘పరిస్థితి మరింత అధ్వానంగా మారే ప్రమాదం ఉంది. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలకుండా ఉండాలంటే వీలైనంత వరకు కరెంటు సరఫరాను నిలిపి వేయడమే మంచిది’’ అని అధికారులు పేర్కొంటున్నారు. చలి పులిని ఎదుర్కొనేందుకు టెక్సాస్ రాష్ట్ర అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఆస్పత్రులు, నర్సింగ్ హోంలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. ఫెడరల్ ప్రభుత్వం నుంచి జనరేటర్లు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. హ్యూస్టన్‌లో ఒక కుటుంబం వారి గ్యారేజీలోని కారు ఎగ్జాస్ట్ నుండి కార్బన్ మోనాక్సైడ్ విడుదల కారణంగా మంటలు వ్యాపించి ఒకరు మృతి చెందారు. అయితే టెక్సాస్‌లో దాదాపు ఆరు లక్షల గృహాలు, వాణిజ్య వాప్యార సంస్థలకు విద్యుత్తును పునరుద్ధరించినట్లు పవర్‌గ్రిడ్ అధికారులు పేర్కొన్నారు. గత వారం రోజుల్లో మంచు తపాను కారణంగా ఇక్క టెక్సాస్ రాష్ట్రంలోనే దాదాపు 130 కార్లు ప్రమాదానికి గురయ్యాయని అధికారులు తెలిపారు. ఇందులో ఆరుగురి వరకు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిదని ప్రజలకు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు టీకా పంపిణీకి అడ్డంకిగా మారాయి.