
స్వతంత్రంగానే బతుకుతాం
స్పష్టం చేసిన హ్యారీ, మేఘన్
ధ్రువీకరించిన బ్రిటన్ రాణి
లండన్: బ్రిటన్ యువరాజు హ్యారీ, భార్య మేఘన్ మార్కెల్ తిరిగి రాజకుటుంబంలో సభ్యులుగా చేరడానికి ఇష్టపడడం లేదని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. రాజ కుటుంబ బాధ్యతలకు దూరంగా, ఆర్థికంగా స్వతంత్రంగా బతకాలని గత ఏడాది తీసుకున్న నిర్ణయానికే ఈ జంట కట్టుబడి ఉందని, అందువల్ల వారి రాచరికపు హోదాలు, బిరుదులు, సైనిక గౌరవాలు తదితరాలన్నింటిని రాజకుటుంబంలోని మిగతా సభ్యులకు రాణి పంచుతారని రాణి ఎలిజబెత్-2 తరఫున విడుదలైన ప్రకటన తెలిపింది. ఇక నుంచి హ్యారీ, మేఘన్‌లకు హిస్ రాయల్ హైనెస్, హర్ రాయల్ హైనెస్ (హెచ్ఆర్హెచ్) బిరుదులు, డ్యూక్ ఆఫ్ ససెక్స్, డచెస్ ఆఫ్ ససెక్స్ హోదాలు ఉండవు. ఈ జంట నిర్ణయంపై రాజకుటుంబంలోని సభ్యులందరూ బాధపడుతున్నట్లు ఆ ప్రకటన పేర్కొంది. 2020 మార్చిలో రాజరికపు బంధనాలకు దూరంగా, స్వతంత్రంగా బతకాలని హ్యారీ (36), మేఘన్ (39) నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఈ నిర్ణయంపై 12 నెలల తర్వాత సమీక్ష చేయాలని నిర్ణయించారు. వచ్చే నెలతో ఆ గడువు తీరనుంది.
ప్రిన్స్ ఫిలిప్‌కు అనారోగ్యం
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ ఇంకా అనారోగ్యంతో లండన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 99 ఏళ్ల ఫిలిప్‌ను వైద్యుల సలహాతో మంగళవారం కింగ్ ఎడ్వర్డ్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయన అనారోగ్యానికి కారణాలు తెలియలేదు. అయితే కరోనా వైరస్‌కు సంబంధించిన కారణాలతో ఫిలిప్ ఆసుపత్రిలో చేరినట్లు బ్రిటన్ రాజవర్గాలు తెలిపాయి.