close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘దిన పత్రికలు- తెలుగు భాష ప్రామాణికత’పై తానా చర్చాగోష్టి  

అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో  "తెలుగు దిన పత్రికలు- తెలుగు భాష ప్రామాణికత"పై చర్చా కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాల దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. తానా అధ్యక్షుడు జయశేఖర్‌ తాళ్లూరి ప్రారంభోపన్యాసం చేశారు. తెలుగు భాషను పరిరక్షించేందుకు పత్రికలు చేస్తున్న కృషిని ఆయన కీర్తించారు. తెలుగు భాషా సాహిత్యాల కోసం తానా నిరంతరం కృషిచేస్తోందన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అతిథులందరికీ ఆహ్వానం పలికారు. 

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. భాష పరిపుష్టి కోసం తెలుగు పత్రికలు నిర్వహిస్తున్న పాత్ర గురుతరమైనదన్నారు. అన్ని ప్రాంతాలవారికీ  ఆమోదయోగ్యమైన, అనుసరించదగిన, జన బాహుళ్యంలోకి ఎక్కువగా చొచ్చుకుపోగలిగే తెలుగు పద సృష్టి జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కృషిలో ప్రభుత్వాలు, తెలుగు అకాడమీలు, సాహిత్య అకాడమీలు ఎక్కువ దృష్టి పెట్టాలని, వాటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు తెలుగు దినపత్రికలు అత్యంత ప్రతిభావంతమైన పాత్రను పోషిస్తాయన్నారు. అందుకే “తెలుగు దినపత్రికలు – తెలుగు భాష ప్రామాణికత” అనే అంశంపై తమ విశేష అనుభవాలను, అభిప్రాయాలను పంచుకోవలసినదిగా వివిధ దిన పత్రికల సంపాదకులను కోరగా అందరూ ఉత్సాహంగా ఒకే వేదికమీదకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. 

ఈ చర్చా గోష్టికి విశిష్ట అతిథులుగా పలు తెలుగు పత్రికల సంపాదకులు హాజరై మాట్లాడారు. ‘ఈనాడు’ దినపత్రిక సంపాదకులు ఎం. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. "మాతృభాషలో పిల్లలకు విద్యలో పునాదులు వేయాల్సిన అవసరం ఉంది. భారతీయ భాషలు అనేకం హలంత భాషలు. తెలుగు అజంత భాష. దీన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పదాలను రామోజీ ఫౌండేషన్ ద్వారా సృష్టిస్తున్నాం’’ అని తెలిపారు. ‘సాక్షి’ సంపాదకులు దిలీప్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రసార మాధ్యమాల్లో లక్ష్యాలు సాధించాలంటే ప్రామాణిక భాష ఉండాలి. ప్రామాణిక భాష ప్రజా ఆమోదయోగ్యంగా ఉండాలి. ఎక్కువ మంది  అంగీకరించిన భాష ప్రామాణిక భాష అవుతుంది. పత్రికలు భాషను నిరంతరం కాపాడుతూ వస్తున్నాయి’’ అని అన్నారు.

‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులు కె. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘వాడుక భాష వేరు. శాస్త్రవిజ్ఞాన భాష వేరు. వాడుక భాష ప్రామాణిక భాష కాలేదు. అచ్చ తెలుగు మాటలతో ప్రామాణికతను సాధించలేం. ఒక కొత్త పదానికి అర్థం నిఘంటువులో లేకపోతే దానికి ప్రామాణికత లేనట్లే అనుకోవాలి. అందువలన నిఘంటువు నిర్మాణాలు విరివిగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అన్నారు.  కొత్త పదాలను  సృష్టించే క్రమంలో వాటిని సంక్లిష్టం చేయటం మంచిదికాదని, దానివల్ల భాష జనానికి దూరం అయ్యే ప్రమాదం ఉందని మన తెలంగాణ దినపత్రిక సంపాదకులు గార శ్రీరామమూర్తి తెలిపారు. ఎక్కువ మంది వాడే పదాలను పత్రికలు వాడితే అధిక ప్రయోజనం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. భాషలో ఎదిగి మాట్లాడటం, ఒదిగి మాట్లాడటం ఉంటాయని ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం వ్యవస్థాపకుడు సతీష్‌ చంద్ర అన్నారు. ఇతర భాషల్లోని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పదాలకు భాషా శాస్త్రవేత్తలు కొత్త పదాలను సృష్టించలేరని, ఆ సాంకేతిక రంగాల్లో ఉన్న వారు మాత్రమే ఈ పదాలను సృష్టించగలరన్నారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ చర్చా కార్యక్రమం విజయవంతం కావడంలో తోడ్పడిన అందరికీ తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు  డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర కృతజ్ఞతలు తెలిపారు. భాషా పరిరక్షణ కోసం ఇలాంటి మరిన్ని ప్రయోజనకరమైన చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 


మరిన్ని