బహుళ వ్యూహాలతోనే చెక్‌!
బహుళ వ్యూహాలతోనే చెక్‌!

 కొవిడ్‌ కట్టడిలో ‘ముంబయి మోడల్‌’
 బీఎంసీ అదనపు కమిషనర్‌ సురేశ్‌ కాకాని
 ‘ఈటీవీ భారత్‌’తో ముఖాముఖి

ముంబయి: కొవిడ్‌ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడంలో ఇప్పుడు ‘ముంబయి మోడల్‌’ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కిక్కిరిసి ఉండే ధారావి వంటి మురికివాడలున్న మహానగరంలో కరోనా కట్టడి దిశగా సత్ఫలితాలు సాధిస్తూ.. నగరపాలక సంస్థ (బీఎంసీ) జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంటోంది. దేశమంతా కొవిడ్‌ కల్లోలాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో బీఎంసీ ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లింది? వాటిని ఎలా అమలు చేసింది? తదితర అంశాలను బీఎంసీ అదనపు కమిషనర్‌ సురేశ్‌ కాకాని ‘ఈటీవీ భారత్‌’కు వివరించారు. ఆయనతో ప్రత్యేక ముఖాముఖి వివరాలివి..

కరోనా మొదటి ఉద్ధృతిలో ముంబయి ‘హాట్‌స్పాట్‌’గా మారింది. అప్పటికి నగరంలో కనీస వసతులు లేవు.. వైద్య సిబ్బందికి కూడా పెద్దగా అనుభవం లేదు. ఈ పరిస్థితిని ఎలా అధిగమించారు?
కరోనా మొదటి ఉద్ధృతి నాటికి మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో యావత్‌ ప్రపంచానికీ తెలీదు. అయితే క్రమేపీ అనేక విషయాలు తెలుసుకున్నాం. కేసుల గుర్తింపు, చికిత్సలు, పరీక్షలతో పాటు మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రాథమిక అవసరాలేమిటో గుర్తించాం. లోతుగా పరిశీలన జరిపి 4 ప్రాధాన్య అవసరాలను తెలుసుకున్నాం. 1. పడకలు అందుబాటులో ఉంచడం 2. ఆక్సిజన్‌తో కూడిన పడకలు 3. ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు 4. ఔషధాలు.. మొదటి ఉద్ధృతి సందర్భంగా వీటి కోసం బాగా పనిచేశాం. గతేడాది అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ముంబయిలో రోజుకు 300-400 కేసులొచ్చేవి. అప్పట్లోనే రెండో ఉద్ధృతి వస్తుందని గుర్తించాం. ప్రపంచవ్యాప్తంగాను, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ అనుభవాలను తెలుసుకున్నాం. అప్పటికి 7 అతిపెద్ద కొవిడ్‌ కేర్‌ ఆసుపత్రులుండేవి. కేసులు తగ్గినా వాటిని ఈ ఏడాది మార్చి 31 వరకు నిర్వహించాలని నిర్ణయానికొచ్చాం. దీనిపై పలు విమర్శలు కూడా వచ్చాయి. అయితే అదే మేం తీసుకున్న సరైన నిర్ణయం. దీంతో తర్వాత కేసులు పెరిగినప్పటికీ వాటిద్వారా సేవలందించాం.
ఆక్సిజన్‌ సరఫరా విధానం: మొదటి ఉద్ధృతి సందర్భంగానే.. తర్వాతి కాలంలో ఆక్సిజన్‌ను అందించడం పెద్ద సవాల్‌గా మారుతుందని మాకు అర్థమైంది. అప్పట్లో నగరంలోని చాలా ఆసుపత్రుల్లో సిలిండర్‌ రూపంలో ఆక్సిజన్‌ సరఫరా అయ్యేది. అయితే వాటిని నింపడం అనేది సవాల్‌గా మారింది. ఈ ప్రక్రియలో ముప్పు కూడా ఉంది. దీంతో కేంద్రీయ ఆక్సిజన్‌ సరఫరా విధానానికి వెళ్లేందుకు నిర్ణయించాం. అవసరాలకు అనుగుణంగా 6 వేల నుంచి 13 వేల లీటర్ల సామర్థ్యం ఉండే ఆక్సిజన్‌ ట్యాంకులను ప్రధాన కొవిడ్‌ ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేశాం. ప్రతి పడకకు పైపులు పెట్టి వీటికి అనుసంధానం చేశాం. దీనిద్వారా నిరంతరాయంగా ఆక్సిజన్‌ సరఫరా ఉండేలా చూడటంతో పాటు, ప్రాణవాయువు వృథాను కూడా తగ్గించ గలిగాం. మరోవైపు మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీదారులు, సరఫరాదారులతో రెండు అంచెలుగా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. పెద్ద ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సరఫరా చేసే బాధ్యతలను తయారీదారులే తీసుకునేలా.. చిన్న ఆసుపత్రులకు సిలిండర్లలో పంపిణీదారులే సరఫరా చేసేలా బాధ్యతలు అప్పగించాం. ఈ నిర్ణయం మొత్తం ఆక్సిజన్‌ సరఫరా ప్రక్రియను క్రమబద్ధం చేసింది.
మొదటి ఉద్ధృతి సమయంలో ధారావి లాంటి మురికివాడల్లో కరోనా వ్యాప్తిని నగరపాలక సంస్థ అడ్డుకోగలిగింది. రెండో ఉద్ధృతిలో అపార్టుమెంటు భవనాల్లోనూ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని మీరు ఎలా నియంత్రిస్తున్నారు?
మేం బహుళ వ్యూహాత్మక విధానాలు అవలంబిస్తున్నాం. తీవ్ర ముప్పు ఉన్న కాంటాక్ట్‌లను ముందే గుర్తించి వారిని కొవిడ్‌ కేంద్రాలకు తరలిస్తున్నాం. ఇలాంటివారిని పరీక్షించడం, చికిత్స అందించడం అనేది కిక్కిరిసిపోయే ధారావి వంటి మురికివాడల్లో సవాల్‌గానే మారింది. అయితే మేం ప్రతి ఇంటికీ వెళ్లి అనుమానితులను గుర్తించడం సత్ఫలితాలనిచ్చింది. ప్రైవేటు వైద్యం అందిస్తున్న వారిని రంగంలోకి దించి.. వారికి పీపీఈ కిట్లు, ఎన్‌95 మాస్కులు ఉచితంగా అందించాం. ధారావిని లాక్‌డౌన్‌ చేయడం సులభమే అయినా.. అక్కడి ప్రజలకు నిత్యావసరాలను సరఫరా చేయడం సవాల్‌గా మారింది. దీంతో ఒంటరిగా ఉంటున్నవారికి వండిన ఆహారాన్ని, కుటుంబాలకు రేషన్‌ సరకులను అందించాం. స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకున్నాం. ఇలాంటి ఉమ్మడి కృషి ఫలితంగా ధారావి మోడల్‌ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
కరోనా మూడో ఉద్ధృతి వస్తే పిల్లల్లో ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశాలున్నట్లు అంచనాలున్నాయి. దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు?
మూడో వేవ్‌ పిల్లలపై పెను ప్రభావం చూపిస్తుందన్న అంచనాలను మేం తెలుసుకున్నాం. మేం వెంటనే పిల్లల ఆరోగ్య సంరక్షణకు ఓ కార్యదళాన్ని (టాస్క్‌ఫోర్స్‌) ఏర్పాటు చేశాం. పిల్లలకు పడకల ఏర్పాటు, వారి తల్లిదండ్రులకు వసతులను కల్పించే అంశాలపై దృష్టి పెట్టాం. ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, వైద్య పరికరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. పిల్లల వార్డులతో కూడిన 4 అతిపెద్ద ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే ఉన్న 4 పెద్ద ఆసుపత్రుల్లోనూ ఇలాంటి వార్డులను ఏర్పాటు చేయనున్నాం. తగినంతగా పడకలు, ఆక్సిజన్‌ సరఫరా, ఐసీయూలను అందుబాటులోకి తెచ్చేలా ప్రైవేటు ఆసుపత్రులను కూడా రంగంలోకి దించుతాం. ఒకవేళ కేసులు పెరిగితే వాటికి తగిన విధంగా సేవలందించే సామర్థ్యం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

వికేంద్రీకరణే విజయబాట..!

ఈనాడు, దిల్లీ: వ్యవస్థను వికేంద్రీకరించడం ద్వారానే కొవిడ్‌ నియంత్రణలో ముంబయి విజయం సాధించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. అక్కడ చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించిన ఆయన సంబంధిత వివరాలను విలేకర్లకు వివరించారు.
* ముంబయిలో ‘సెంట్రల్‌ వార్‌రూమ్‌’ విధానాన్ని రద్దుచేసి 24 వార్డుల్లోనూ వార్‌రూమ్‌లను ఏర్పాటు చేసి వాటిద్వారా స్థానిక పరిస్థితులను పర్యవేక్షించారు. కరోనా పరీక్ష ఫలితాలను నేరుగా రోగులకు కాకుండా అధికారులకు పంపించి, వారిద్వారా రోగులకు అందిస్తున్నారు. ఆ సమయంలో అధికార వ్యవస్థ రోగులకు తగిన మార్గదర్శకత్వం అందిస్తోంది.
* ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఒక్కటే ప్రతిరోజూ నగరంలోని 55 ల్యాబ్‌ల నుంచి 10 వేల పరీక్ష ఫలితాలను తెలుసుకుని వాటిని వార్డుల వారీగా వార్‌రూమ్‌లకు అందజేస్తోంది. వాటి ఆధారంగా బాధితులకు తగిన సేవలందిస్తున్నారు. దీనిద్వారా బాధితు పర్యవేక్షణ వార్డుల వారీగా వికేంద్రీకృతమవుతోంది.
* 800 ఎస్‌యూవీలను అంబులెన్సులుగా మార్చి వైద్య సేవల కోసం ఉపయోగించారు. వీటిని ట్రాక్‌ చేస్తూ పర్యవేక్షించడానికి ఓ సంస్థ సాయంతో సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేశారు.
* నగరంలో ఉన్న 172 కొవిడ్‌ ఆసుపత్రుల పర్యవేక్షణ కోసం ఒక కేంద్రీకృత డ్యాష్‌బోర్డును ఏర్పాటు చేశారు. ఏ ఆసుపత్రిలో ఏ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నది దీనిద్వారా పర్యవేక్షించారు. ఆసుపత్రుల్లో పడకల సేకరణ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పారు.

Tags :

మరిన్ని