close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బైడెన్‌, కమలా హారిస్‌ దీపావళి శుభాకాంక్షలు

వచ్చే ఏడాది శ్వేతసౌధంలో అందరి మధ్య జరుపుకోవాలని ఆకాంక్ష

వాషింగ్టన్‌: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజులు మరింత ప్రకాశవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సరి సంపదలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. 

‘‘దీపావళి పండుగ జరపుకొంటున్న హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు నేను, డాక్టర్‌ బైడెన్‌(బైడెన్‌ సతీమణి) శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొత్త సంవత్సరంలో మీ జీవితాలు ఆశ, ఆనందం, ఐశ్వర్యంతో నిండాలని కోరుకుంటున్నాను’’ -బైడెన్‌, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అభ్యర్థి

‘‘దీపావళి జరపుకొంటున్న ప్రతిఒక్కరికి నేను, డగ్లస్‌(హారిస్‌ భర్త) శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఆరోగ్యంతో, సంతోషంతో, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం’’

- కమలా హారిస్‌, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన అభ్యర్థి

‘‘దీపావళి పండుగ సందర్భంగా, స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు ఒకదగ్గర చేరి చెడుపై మంచి, చీకటిపై వెలుతురు, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయాన్ని స్మరించుకుంటారు. ఇళ్ళు, కార్యాలయాలు, ప్రార్థనా స్థలాలు ఇలా ప్రతి చోటా వెలిగే దీపాల నుంచి వెలువడే వెచ్చదనం.. మన జీవితాల్లోకి కొత్తగా వస్తున్న విశ్వాసం, ఆశ, సంతోషాన్ని గుర్తుచేస్తాయి. అమెరికా ఓ నమ్మకమైన దేశం. అమెరికన్లందరూ వారి ఆచారాల ప్రకారం జీవించడానికి, ఇష్టదైవాన్ని ఆరాధించడానికి మా పాలన రాజ్యాంగబద్ధమైన హక్కును, అవకాశాన్ని కల్పిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. దీపావళిని పురస్కరించుకొని అమెరికన్లను వెలిగించే ప్రతి దీపం ఈ దేశ మతస్వేచ్ఛను మరింత ఇనుమడింపజేస్తుంది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా దీపావళి జరపుకొంటున్న ప్రతిఒక్కరికీ నేను, ప్రథమ మహిళ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’’ -ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడు  

అలాగే తాజా ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్‌, కమలా హారిస్‌ సంయుక్త ప్రకటనను కూడా విడుదల చేశారు. మహమ్మారి కారణంగా ఈ ఏడాది తమ ఆత్మీయులను కోల్పోయిన ప్రతిఒక్కరికీ తమ సానుభూతి ప్రకటించారు. కరోనాపై పోరులో ముందున్నవారు, వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. దీపావళి రోజు వెలిగే ప్రతి దీపం జ్ఞానం, శాస్త్రీయత, సత్యం, ఐక్యతను చాటుతుందని వ్యాఖ్యానించారు. వీడియో కాల్స్‌ ద్వారా జరపుకొంటున్న ఈసారి ఉత్సవాలు.. వచ్చే ఏడాది శ్వేతసౌధంలో అందరి మధ్య నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. 



మరిన్ని