సింగపూర్‌లో ఘనంగా మేడే వేడుకలు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సింగపూర్‌లో ఘనంగా మేడే వేడుకలు

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూమ్, యూట్యూబ్ వేదికగా ఆనందోత్సాహాల మధ్య వినోదభరితంగా సాగిన ఈ కార్యక్రమానికి సుమారు 800 మంది స్థానిక తెలుగు కార్మికసోదరులు పాల్గొన్నారు. పూర్వ మరియు ప్రస్తుత కార్యవర్గసభ్యులతో పాటు సినీహీరో మంచు విష్ణు కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ సింగపూర్ తెలుగు సమాజం తెలుగు కార్మిక సోదరులకి ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కొవిడ్‌పరిస్థితుల్లో సింగపూర్ ప్రభుత్వ తీసుకొంటున్న జాగ్రత్తలను కొనియాడారు. ఇలాంటి క్లిష్టపరిస్ధితులో అందరూ ధైర్యంగా , కలసికట్టుగా ఉంటూ చేతనైనంతలో సాయపడదామని పిలుపునిచ్చారు. కార్మికులకు బయట జరిగే ప్రమాదాలకు బీమా కల్పించే అవకాశాన్ని సింగపూర్‌లోని భారత హైకమీషన్ దృష్టికి తీసుకెళ్లామని, వారు కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. సింగపూర్‌లో నివశించే ప్రవాస కార్మికులందరికీ ఉపయోగపడేట్లుగా , భారత హైకమీషన్ నేతృత్వంలో వివిధ సంస్థల సహకారంతో ఒక బృహత్తర ప్రణాళికతో త్వరలో అందరిముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. సింగపూర్‌లో భారత హైకమీషనర్ కుమరన్‌ మాట్లాడుతూ సింగపూర్ తెలుగు సమాజం కార్యక్రమాలను, ప్రశంసించారు. కార్మికుల శ్రేయస్సు పట్ల సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గం చూపిస్తున్న శ్రద్ధను, తాపత్రయాన్ని అభినందించారు. తెలుగు సమాజం కార్మికుల బీమా పథకం ప్రతిపాదనను , అలాగే అది ఎలా ముందుకు రానుందో వివరించారు.

స్ధానిక రెస్టారెంట్స్ సహకారంతో , కుటుంబాలకు దూరంగా ఉన్న సుమారు 800 మంది కార్మిక సోదరులకు భోజన సదుపాయానికి సహకరించిన రెస్టారెంట్స్ యాజమాన్యాలకు సహనిర్వాహకులు నరసింహగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. మేడేని పురస్కరించుకొని , రెడ్ క్రాస్ సంస్ధ సహకారంతో హెల్త్ సైన్సెస్ అథారిటి ప్రాంగణంలో రక్తదానశిబిరం నిర్వహించగా సుమారు 85 దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారని , వారికి సహ నిర్వాహకులు మేరువ కాశయ్య ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగు వారికి, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ , కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రమించిన కార్యవర్గసభ్యులకీ కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

మరిన్ని