ఇక వెళ్లొస్తా.. మెలానియా వీడ్కోలు సందేశం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఇక వెళ్లొస్తా.. మెలానియా వీడ్కోలు సందేశం

వాషింగ్టన్‌: అగ్రరాజ్య ప్రథమ మహిళగా కొనసాగేందుకు మెలానియా ట్రంప్‌కు కేవలం కొద్ది గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో.. సంప్రదాయాన్ని అనుసరించి దేశ ప్రజలకు ఇవ్వాల్సిన వీడ్కోలు సందేశాన్ని ఏడు నిమిషాలు సాగే వీడియో రూపంలో వెలువరించారు. అమెరికా ప్రథమ మహిళగా ఉండటం తనకు జీవితంలో లభించిన అతి గొప్ప గౌరవమని వినయంగా ప్రకటించారు. కరోనా కాలంలో అమూల్య సేవలందిస్తున్న వైద్యారోగ్య సిబ్బందితో సహా.. సైనికులు, న్యాయాధికారులు, చిన్నారులు, మాతృమూర్తులు అందరికీ తన హృదయంలో సముచిత స్థానముందని మెలానియా వెల్లడించారు.

ఆ ప్రస్తావన లేకపోయినా..

జనవరి 6 నాటి క్యాపిటల్‌ భవనంపై దాడి ఘటనలో ట్రంప్‌ పాత్రపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన ప్రసంగంలో ఈ సంఘటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ.. తాను హింసకు వ్యతిరేకమని మెలానియా స్పష్టం చేశారు. హింస దేనికీ సమాధానం కాదని, అది సమర్థనీయం కాదనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు. దేశాన్ని ఏకంచేసే అంశాలపై దృష్టి పెట్టాలని ఆమె యువతకు సూచించారు. అమెరికా ఖ్యాతిని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు ప్రజలందరూ ఒకే కుటుంబంగా మెలిగి, భవిష్యత్‌ తరాలకు ఆశాదీపంగా ఉండాలన్నారు.

మెలానియా అలా చేస్తే బాగుండేది..

అమెరికా ప్రథమ మహిళగా ఉండే చివరి రోజుల్లో మెలానియా చాలావరకు శ్వేతసౌధానికి దూరంగానే ఉంటున్నారు. తన భర్త,అధ్యక్షుడు ట్రంప్‌ పదవీకాలం త్వరలో ముగియటం ఆమెకు అంత విచారకరంగా ఉన్నట్లు కనిపించటం లేదని పరిశీలకులు అంటున్నారు. పైగా తన కుమారుడు బారన్‌కు ఫ్లోరిడాలో ఓ మంచి స్కూలును వెతికే పనిలో ఆమె బిజీగా ఉన్నారట. గత 152 సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లుగా.. కాబోయే అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ప్రస్తుత ప్రథమ మహిళగా హాజరయేందుకు కూడా నిజానికి ఆమెకేమీ అభ్యంతరం ఉండకపోవచ్చని వారు అంటున్నారు. ఇదిలా ఉండగా మెలానియా తన వీడ్కోలు సందేశంలో కాబోయే ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ను స్వాగతించక పోయినా.. కనీసం అభినందనలు తెలియచేస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి..

చీరకట్టుతో కమలా హ్యారిస్‌ ప్రమాణ స్వీకారం?మరిన్ని