Little Island: నదిపై రూ.1,900 కోట్ల విలువైన ఐలాండ్‌
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
Little Island: నదిపై రూ.1,900 కోట్ల విలువైన ఐలాండ్‌

న్యూయార్క్ వాసులకు నేటి నుంచే అందుబాటులోకి..

ఆల్మనీ: నదిలో తెల్లని పువ్వులు వికసించినట్లు కనిపిస్తోన్న నిర్మాణం ఇప్పుడు అమెరికన్లను ఆకర్షిస్తోంది. న్యూయార్క్‌ నగరంలోని హడ్సన్ నదిపై తులిప్ పుష్పాల కాడలను స్తంభాలుగా మలిచి ఏర్పాటు చేసిన పార్క్‌ అబ్బురపరుస్తోంది. ‘లిటిల్‌ ఐలాండ్’ పేరున నిర్మించిన ఈ పార్క్‌కు అక్షరాలా 260 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.1,900 కోట్లు)ను వెచ్చించారు. అమెరికన్ వ్యాపారవేత్త బ్యారీ మిల్లర్ ఈ నిధులు సమకూర్చారు. 2.4 ఎకరాల్లో, 132 తులిప్‌ ఆకారపు కాంక్రీట్‌ స్తంభాలతో నిర్మితమైన ఈ పార్క్..శుక్రవారం( మే 21) నుంచి వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది. హడ్సన్ నదిలో కొలువుతీరిన ఈ పార్క్‌ను చేరుకునేందుకు రెండు వంతెనలను ఉపయోగిస్తున్నారు. 

ఈ పార్క్ ప్రాంతమంతా సమతలంగా లేకపోవడం దీని ప్రత్యేకత. దీని నిర్మాణంలో తులిప్ కాంక్రీట్ స్తంభాలను వాడారు. వాటిని బయట నిర్మించి నదిలోకి తీసుకొచ్చి అమర్చారు రూపకర్తలు. ఏ రెండు స్తంభాలు ఒకేలా ఉండకపోవడం వాటి ప్రత్యేకత. అందుకే పార్క్‌ ఎత్తులో తేడా స్పష్టంగా తెలుస్తోంది. దాంతో పార్క్‌లో నడుస్తుంటే కొండపైకి ఎక్కుతున్నట్లు, అక్కడి నుంచి కిందికి దిగుతున్న అనుభూతి కలుగుతుందని లిటిల్ ఐలాండ్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ట్రిష్ సాంతిని వెల్లడించారు. అక్కడి నుంచి నగరాన్ని వీక్షిస్తుంటే విభిన్న దృశ్యాలు చూస్తున్నట్టు ఉంటుందన్నారు.

ఆహ్లాదపరిచే పచ్చదనం, నదీగాలులను ఆస్వాదిస్తూ నచ్చిన షోలు చూసేందుకు వీలుగా బహిరంగ థియేటర్ ఆ పార్క్‌కున్న మరో ప్రత్యేకత. పగలు చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా, రాత్రుళ్లు పెద్దలు సేదతీరేలా దీన్ని రూపొందించడం మరో విశేషం. ఒకేసారి సుమారు వెయ్యిమందికి వీక్షకులకు అవకాశం ఉన్న ఆ లిటిల్ ఐలాండ్ నిర్మాణం 2017లో ప్రారంభమైంది. 


మరిన్ని