
వాషింగ్టన్: జాగ్రత్తలు పాటించకుంటే కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని అమెరికా వ్యాధుల నియంత్రణ సంస్థ (సీడీసీ) హెచ్చరించిన వేళ అధ్యక్షుడు జో బైడెన్ చర్యలకు ఉపక్రమించారు. మాస్కు కచ్చితంగా ధరించాలన్న ఆదేశాలను సడలించినట్లయితే.. వాటిని తిరిగి కఠినతరం చేయాలని అన్ని రాష్ట్రాల గవర్నర్లు, నాయకులకు సూచించారు. శ్వేతసౌధంలో మాట్లాడిన బైడెన్ ఇది రాజకీయం కాదని.. వైరస్ వ్యాప్తి నివారణకు నిబంధనలు పాటించాలని కోరారు.
టీకాను మరిన్ని వర్గాలకు విస్తరిస్తూ చేపట్టిన ప్రణాళికలను బైడెన్ ప్రకటించారు. ఏప్రిల్ 19 నాటికి అమెరికా వయోజనుల్లో 90 శాతం మందికి కొవిడ్ వ్యాక్సిన్ అందజేసేందుకు కృషి చేస్తున్నామన్న అధ్యక్షుడు.. ఇంటికి ఐదు మైళ్ల దూరంలోనే వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ వారంలో 33 మిలియన్ల కొవిడ్ వ్యాక్సిన్లు సిద్ధమవుతాయని భావిస్తున్నట్లు పేర్కొన్న బైడెన్ వాటిలో జాన్సన్ అండ్ జాన్సన్కు చెందిన సింగిల్ డోస్ టీకాలు 11 మిలియన్లు ఉన్నట్లు పేర్కొన్నారు.