అద్భుతంగా అలరించిన సంగీత ‘రాగావధానం’
close
అద్భుతంగా అలరించిన సంగీత ‘రాగావధానం’

ఇంటర్నెట్‌డెస్క్‌: సింగపూర్ ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై ఏర్పాటు చేసిన, ప్రముఖ సంగీత విద్వాంసులు గరికిపాటి వెంకట ప్రభాకర్  ‘రాగావధానం’ సంగీత ప్రియులను విశేషంగా అలరించింది. గరికిపాటి వెంకట ప్రభాకర్, పద్మ లలిత దంపతులు జ్యోతి ప్రకాశనంతో కార్యక్రమం ప్రారంభమైంది. అమెరికా నుంచి డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, భారత్‌ నుంచి డాక్టర్ వంశీ రామరాజు, ప్రముఖ గాయకులు జి.ఆనంద్, గాయని సురేఖ మూర్తి తదితరులు గౌరవ అతిథులుగా విచ్చేసి తమ అభినందనలు తెలియజేశారు.

సాహిత్య అష్టావధాన ప్రక్రియలా సింగపూర్ నుంచి విద్యాధరి, శేషుకుమారి, సౌభాగ్య లక్ష్మి, షర్మిల, పద్మావతి, స్నిగ్ధ, అనంత్‌లు పృచ్ఛకులుగా వ్యవహరించగా, రాధిక మంగిపూడి అప్రస్తుత ప్రసంగం చేస్తూ సమన్వయకర్తగా వ్యవహరించారు. పృచ్ఛకులు అడిగిన పాటలకు అప్పటికప్పుడు అవధాని, అడిగిన రాగాన్ని మార్చడం, అడిగిన తాళంలో మార్చి పాడడం, రాగమాలికగా లేక తాళమాలికగా అల్లి పాడడం, పద్యాలలోని స్వరాక్షరాలను ఆయా స్వర స్థానాలలోనే పాడడం, పృచ్ఛకులు నిషేధించిన స్వరాలను వర్జించి రాగాలను పాడడం వంటి చక్కటి రాగ తాళ రస విన్యాసాలతో ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ప్రేక్షకులను ఈ కార్యక్రమం కట్టిపడేసింది. అమెరికా, హాంకాంగ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నార్వే దేశాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా వివిధ తెలుగు ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించారు.
ఈ సందర్భంగా ముఖ్య నిర్వాహకులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ ‘జీవి ప్రభాకర్ కార్యక్రమానికి సంపూర్ణ న్యాయం చేకూర్చారు. ఎలాంటి ప్రశ్నలు అడిగినా ఎంతో హుందాగా ఆయా రాగాలను తాళాలను గురించి వివరించారు. అందరికీ తెలిసిన పాటలను ఉదాహరించి పాడుతూ సంగీత జ్ఞానం లేనివారిని కూడా అలరించే విధంగా కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. కార్యక్రమం ఆసాంతం వినోదాత్మకంగానూ విజ్ఞానదాయకంగానూ కొనసాగింది’’ అని తెలియజేశారు.

అతిథిగా విచ్చేసిన సురేఖ మూర్తి అప్పటికప్పుడు ఒక కొత్త పాటను ఇచ్చి చంద్రకౌంసు రాగంలో స్వర పరచమని అడుగగా అవధాని వెంటనే ఆ పాటను ఆ రాగంలో స్వరకల్పన చేసి వినిపించారు. జీవి ప్రభాకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం తనకెంతో ఆనందంగా అనిపించిందన్నారు. ఎన్నో విలక్షణమైన ప్రశ్నలకు తాను తృప్తికరంగా సమాధానాలు ఇవ్వగలిగానని అన్నారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి వారికి, అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం అందించగా, e remit , గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్, యీగ జ్యూస్ వారు ఆర్థిక సహాయం అందించారు, అమెరికాలోని యూఎస్ టెలివిజన్ వన్ ఛానల్ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈక్షణం, సింగపూర్ తెలుగు టీవి మీడియా పార్టనర్‌గా సహకారం అందించారు.


Tags :

మరిన్ని