close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సాగువీరుడా..! సాహిత్యాభివందనం  

సంక్రాంతి వేళ తానా ప్రత్యేక కార్యక్రమం

అమెరికా:  సంక్రాంతి పండుగ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో  “సాగువీరుడా..! సాహిత్యాభివందనం” అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాలంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి స్వాగతోపన్యాసంలో రైతుగా తన అనుభవాలను, తానా సంస్థ ద్వారా చేస్తోన్న సేవలను వివరిస్తూ రైతు ప్రాముఖ్యతను గుర్తుచేసుకున్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ రైతుల కష్టాలను, సమాజంలో రైతు పోషిస్తున్న అద్వీతీయమైన పాత్రను కవిత్వ రూపంలో పంచుకున్నారు.

రైతులే ప్రత్యక్ష దైవాలు: ప్రసాద్‌ తోటకూర
ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా మానవాళి మొత్తం జీవించడానికి అవసరమైన ఆహారాన్ని సమకూరుస్తోన్న అన్నదాతలను అనునిత్యం స్మరించుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా అనేక ప్రతికూల పరిస్థితులను తట్టుకొని సేద్యం చేస్తున్న రైతులే ప్రత్యక్ష దైవమని కొనియాడారు. గ్రామీణ జీవితాలను, రైతుల కృషిని పాఠ్యాంశాల్లో చేర్చి యువతను మేల్కొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరచిపోతున్న కొన్ని పదాలు – ఎలాపట, దాపట; చ్చో చ్చో, హహయి; తాబేటికాయ, ఏతాము, బల్లకట్టు, బుంగపోత లాంటి వ్యవసాయ పారిభాషిక పదాలను ఆసక్తికరంగా వివరించారు.

“రైతు కోసం తానా” అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా రైతులకు కావలసిన సమాచారాన్ని అవసరమైన పరికరాలను అందించడంలో తానా చేస్తోన్న కృషిని, తానా రైతు విభాగపు సమన్వయకర్త డా. కోట జానయ్య వివరించారు.

పద్మశ్రీ డా. ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రైతు నేస్తం, పశు నేస్తం, ప్రకృతి నేస్తం, రైతు నేస్తం ఫౌండేషన్, ప్రకృతి వ్యవసాయ చైతన్య రథం అనే మొబైల్ వ్యాన్ ద్వారా లక్షలాది మంది రైతులను ఏ విధంగా చైతన్యపరుస్తున్నదీ, సిరి ధాన్యాలను, మిద్దె తోటల సాగులో ఉన్న మెలకువలతో తగిన శిక్షణ ఇస్తున్నదీ సోదాహరణంగా వివరించారు. అలాగే, కొత్తగూడేనికి చెందిన బీటెక్‌ రవి తన 200 ఎకరాల పొలంలో రూ. రెండు వందల కోట్ల వ్యాపారాన్ని, పది మంది పీహెచ్‌డీ విద్యావేత్తలకు, ఐదు వందల మంది వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న వైనాన్ని వివరించారు. దీంతో పాటు అనేక రకాల కూరగాయల విత్తనాలను సృష్టిస్తున్న తీరును, ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది రైతులు తన వ్యవసాయ క్షేత్రాన్ని, తాను చేస్తున్న పరిశోధనలను నిశితంగా పరిశీలించేందుకు వస్తున్న వివరాలను ఆయన పంచుకున్నారు.  

మహిళల కోసమే ప్రత్యేకంగా రాజమండ్రిలో ఇంజనీరింగ్ కళాశాల నెలకొల్పిన కళ్ళెం ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తూ రైతు రాజ్యం అనే లాభాపేక్షరహిత సంస్థ ద్వారా ఖమ్మంలో రైతు కుటుంబాలు, రైతు కార్మికుల పిల్లలకు ఉచిత విద్యను ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు.

కెనడాలో సన్డైన్ ప్రొడ్యూస్ సంస్థను స్థాపించి కరిబ్బియన్‌ దేశాలు, మెక్సికో, హోండోరాస్, నికారగువా, అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం  నుంచి వివిధ రకాల కూరగాయలను దిగుమతి చేసుకొని ఆ దేశంలో వివిధ వ్యాపార సంస్థలకు సరఫరా చేస్తున్న వివరాలు, దాంట్లో ఉన్న సాధకబాధకాలను  శ్రీధర్ ముండ్లూరు సంక్షిప్తంగా వివరించారు. 

కృష్ణా జిల్లా ఘంటసాలపాలెంకు చెందిన ఆదర్శ రైతు ఉప్పల ప్రసాదరావు మాట్లాడుతూ..  తాను చేస్తున్న నూట డెబ్బైఐదు ఎకరాల వ్యవసాయంలో అవలంబిస్తున్న పద్ధతులను, 200 గేదెలను, ఆవులను ద్వారా పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తున్న విషయాలను పంచుకున్నారు. తెలంగాణా రాష్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేకంగా ఫోన్ చేసి ప్రసాదరావు చేస్తున్న ఎద వ్యవసాయం, వాడుతున్న యంత్రపరికరాల గురించి పదిహేను నిమిషాల పాటు మాట్లాడి తెలుసుకున్నారు. అంతేకాదు, ఆయన్ను స్వయంగా ముఖ్యమంత్రి హైదరాబాద్‌ ఆహ్వానించి, మరిన్ని మెళకువలను తెలియజేయవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ గేయ రచయితలు, గాయకులు వందేమాతరం  శ్రీనివాస్, మారెన్న (అనంతపురం), మానుకోట ప్రసాద్ (హైదరాబాద్), నూజిళ్ళ  శ్రీనివాస్ (రాజమండ్రి), కృష్ణవేణి (తిరుపతి), లెనిన్ బాబు (అనంతపురం), రత్నం (చిత్తూరు), డా.అరుణ సుబ్బారావు (హైదరాబాద్), నాగమల్లేశ్వరరావు (అమరావతి), లక్ష్మణ మూర్తి (తూముకుంట), గిద్దె రామనరసయ్య (వరంగల్) పాల్గొని రైతు నేపథ్య సాహిత్యంతో కూడిన అనేక అద్భుత గీతాలను మధురంగా ఆలపించి ఈ కార్యక్రమానికి నూతన శోభ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తోడ్పడిన తానా కార్యవర్గ సభ్యులకు, సాంకేతిక సహకారం అందించిన వారికి, విశిష్ట అతిథులకు, గాయనీ గాయకులకు డా.ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

మరిన్ని