close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఘనంగా తానా ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం

21 దేశాలు.. 21 సంస్థలు.. 25గంటలు

న్యూయార్క్‌: ప్రపంచ సాహిత్య చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం-21’ ఘనంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం ఏప్రిల్‌ 10న ఉదయం 8గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 9గంటల వరకు 25గంటల పాటు అంతర్జాల దృశ్య సమావేశం నిర్విరామంగా కొనసాగింది. ప్లవ నామ ఉగాది పర్వదినం సందర్భంగా భారత్‌, అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 21 దేశాల్లోని 21 తెలుగు సంఘాల నుంచి 246 మంది కవులు, పండితులు, సాహితీ ప్రియులు, యువతీ-యువకులు ఈ కవి సమ్మేళనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రముఖ సంగీత విద్వాంసురాలు కల్యాణి ద్విభాష్యం, ప్రముఖ గాయని లక్ష్మీ భావజలు శ్రావ్యంగా ఆలపించిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. తానా సంస్థ తెలుగు భాషా సంస్కృతులకు ప్రాధాన్యమిస్తూ 21 దేశాల్లోని 21 సంస్థలతో ప్రపంచ కవి సమ్మేళనం నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న, వీక్షిస్తున్న తెలుగు ప్రజలందరికీ ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

‘ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి తెలుగు భాషాభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశంతోనే ఇంతటి బృహత్‌ అక్షర యజ్ఞం తలపెట్టినట్టు తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌ అన్నారు. మాతృభాషలోనే మన నాగరికత, ఉనికి ఇమిడి ఉన్నాయన్నారు. భాషను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకురాలు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ.. ఏడాది కాలంగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం వివిధ అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలంలో సాహిత్య సమావేశాలు, మరికొన్ని ప్రత్యేక సాహిత్య కార్యక్రమాలను జరుపుకొంటున్నామన్నారు. కానీ, ఇంత పెద్ద కార్యక్రమం జరుపుకోవడం ఇదే మొదటిసారని చెప్పారు. విశ్వవ్యాప్తంగా ఈ సాహితీ యజ్ఞంలో పాల్గొంటున్న తెలుగు సంఘాల అధ్యక్షులు, భాషాభిమానులు, వీక్షకులకు ఆయన ఘన స్వాగతం పలికారు.

ఒక్కో దేశానికి ఒక్కో గంట!

25గంటల పాటు ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ ప్రపంచ మహాకవి సమ్మేళనం వేదిక నిర్వాహకులు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్‌ నిర్వహణలో ఆద్యంతం అత్యంత వైభవంగా జరిగింది. తానా మహిళా విభాగం సమన్వయకర్త శిరీష తూనుగుంట్ల సాంకేతిక సహకారం అందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లబ్ధ ప్రతిష్టులైన కవులు, పండితులు తమ కవితలతో ఆద్యంతం అలరించారు. ఒక్కో దేశానికి ఒక్కో గంట సమయం కేటాయించి ఆ గంటలో ఆ దేశానికి సంబంధించిన కవులతో కవి సమ్మేళనాలు నిర్వహించారు.

ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా తెలంగాణ మానవహక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య, విశిష్ట అతిథిగా మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు, ప్రత్యేక అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాస్‌ హాజరై తెలుగు భాషా వైభవాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రసంగించారు. అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాస్ హాజరై తెలుగు భాషా వైభవాన్ని పెంచడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు.

ముగింపు సభకు ముఖ్య అతిథిగా పద్మ భూషణ్ డా.కె.ఐ.వర ప్రసాద్ రెడ్డి హాజరై “నూతన పదకోశ అభివృద్ధే భాషా పరిరక్షణకు మూలమని, ఆ దిశగా అందరూ ఆలోచించాలి’ అని కోరారు. విశిష్ట అతిథిగా హాజరైన తనికెళ్ల భరణి, ప్రత్యేక అతిథులుగా హాజరైన ప్రముఖ పాత్రికేయులు జాస్తి విష్ణు (ఈనాడు), కె.  శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి), దిలీప్ రెడ్డి (సాక్షి)  హాజరై భాషాభివృద్ధికి విలువైన పలు సూచనలు చేశారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థలు ఇవే..

శ్రీ సాంస్కృతిక కళా సమితి - సింగపూర్; మలేషియా తెలుగు సంఘం - మలేషియా; హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య- హాంకాంగ్; తెలుగు కళా సమితి – ఒమన్; తెలుగు కళాసమితి – ఖతర్; తెలుగు సంఘాల ఐక్యవేదిక – కువైట్; సౌదీ తెలుగు అసోసియేషన్ - సౌదీ అరేబియా; తెలుగు కళా సమితి –  బెహ్రయిన్‌;  తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా - సౌత్ ఆఫ్రికా; తెలుగు అసోసియేషన్ ఆఫ్  బోట్స్వానా; నైజీరియా తెలుగు సంఘం – నైజీరియా; ఫ్రాన్స్ తెలుగు సంఘం – ఫ్రాన్స్; ఫిన్లాండ్‌ తెలుగు సంఘం – ఫిన్లాండ్; డెన్మార్క్ తెలుగు సంఘం – డెన్మార్క్; నార్వే తెలుగు సంఘం – నార్వే; నార్తర్న్ ఐర్లాండ్‌  తెలుగు సంఘం - నార్తర్న్ ఐర్లాండ్‌;  తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ – యూకే; తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్ లాండ్ - స్కాట్ లాండ్;  తెలుగు అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్ – న్యూజిల్యాండ్;  తెలుగు మల్లి – ఆస్ట్రేలియా;  తెలుగు అసోసియేషన్ ఆఫ్ చైనా – చైనా; అమెరికా, మరియు భారతదేశం.

ఈ కార్యక్రమాన్ని వివిధ ప్రసార మాధ్యమాలలో ప్రసారం చేసిన యాజమాన్యాలకు, కార్యవర్గ సభ్యులకు, తెలుగు సంఘాల అధ్యక్షులకు, పాల్గొన్న సాహితీ ప్రియులందరినీ వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్  కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags :

మరిన్ని