దక్షిణాఫ్రికా రకంపై వ్యాక్సిన్‌ పనిచేయదేమో..!
దక్షిణాఫ్రికా రకంపై వ్యాక్సిన్‌ పనిచేయదేమో..!

అనుమానం వ్యక్తం చేసిన బ్రిటన్‌

లండన్‌: ప్రపంచ దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తోన్న సమయంలోనే కొత్త రూపంలో ఈ మహమ్మారి విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే అందుబాటులోకి వస్తోన్న వ్యాక్సిన్‌లు వీటిని ఎదుర్కొంటాయా?లేదా? అనే విషయంపై ఇప్పటకే పరిశోధనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్తరకం వైరస్‌పై వ్యాక్సిన్‌లు పనిచేయకపోవచ్చని బ్రిటన్‌ మంత్రి తాజాగా వ్యక్తపరిచిన అనుమానాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ‘దక్షిణాఫ్రికా వైరస్‌ రకంపై వ్యాక్సిన్‌లు పనిచేస్తాయో లేదో అనే విషయంపై నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాక్సిన్‌ సమర్థవంతంగా ఎదుర్కోవడం లేదని తెలుస్తోంది’ అని బ్రిటన్‌ మంత్రి గ్రాంట్‌ షాప్స్‌ బ్రిటన్‌ మీడియాలో వెల్లడించారు. ఇప్పటికే అక్కడ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావడం, కొత్తరకం కేసులు కూడా ఎక్కువే నమోదవుతున్న నేపథ్యంలో బ్రిటన్‌ మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

మ్యుటేషన్‌ చెందిన కరోనా వైరస్‌లలో ఇప్పటివరకు మొత్తం నాలుగు రకా‌లు వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వీటిలో బ్రిటన్‌, దక్షిణాఫ్రికా దేశాల్లో బయటపడిన కొత్తరకం వైరస్‌లు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. ఇక బ్రిటన్‌ వైరస్‌ ఇప్పటికే దాదాపు 40 దేశాలకుపైగా వ్యాపించగా, దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్‌ కూడా పలు దేశాలకు పాకింది. వైరస్‌ పరివర్తనం చెందినప్పటికీ తమ టీకా పనిచేస్తుందని ఫైజర్‌తో పాటు యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ నిపుణులు ఈమధ్యే వెల్లడించారు. వీటిపై పూర్తిస్థాయి విశ్లేషణ కొనసాగుతోందని పేర్కొన్నారు. అయితే, వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల వృద్ధిచెందిన యాంటీబాడీల నుంచి వైరస్‌ తప్పించుకునే ప్రమాదం కూడా ఉందని ఆ సంస్థకే చెందిన మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదిలాఉంటే, కొత్తరకం వైరస్‌లపై వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందని భారత్‌ బయోటెక్‌, మోడెర్నా వ్యాక్సిన్‌ కంపెనీలు కూడా ఈ మధ్యే స్పష్టం చేశాయి. వైరస్‌ మ్యుటేషన్‌ చెందినప్పటికీ వాటిని ఎదుర్కొనే సామర్థ్యం ఈవ్యాక్సిన్‌లకు ఉంటుందని పేర్కొంటున్నాయి. ఏదేమైనా కొత్తరకంపై వ్యాక్సిన్‌లు పనిచేయడంపై మరికొన్ని రోజుల్లోనే స్పష్టతవచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి..
41 దేశాలకు పాకిన కొత్తరకం కరోనా!
కొత్తరకం కరోనా వైరస్‌కూ మా టీకా పనిచేస్తుంది


మరిన్ని