close
లోక్‌సభ పోరుకు సిద్ధం కండి

ఫిబ్రవరిలోనే అభ్యర్థుల ఎంపిక పూర్తి కావాలి
తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఏఐసీసీ సూచన

ఈనాడు, దిల్లీ: ‘‘ముందస్తు కసరత్తులు చేసినా.. అనేక జాగ్రత్తలు తీసుకున్నా తెలంగాణ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. ఇకనైనా జాగ్రత్త తీసుకోండి. రాష్ట్ర అంశాలే కేంద్ర బిందువు కావడం.. పార్టీపరమైన పొరపాట్లతో నష్టపోయాం.. లోక్‌సభ పోరుకు అన్నివిధాలా సిద్ధం కండి.. ఫిబ్రవరిలోనే లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయండి.. అభ్యర్థులపై క్షుణ్నంగా చర్చించి ఆ సారాంశాన్ని ఏఐసీసీకి పంపించండి’’ అని ఏఐసీసీ కోర్‌ కమిటీ సభ్యులు ఏకే ఆంటోనీ, అహ్మద్‌పటేల్‌, మల్లికార్జున ఖర్గే, జైరాం రమేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతే లక్ష్యంగా అన్నిరాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కోశాధికారులు, రాష్ట్ర వ్యవహారాల బాధ్యులతో దిల్లీలోని కాంగ్రెస్‌ వార్‌రూంలో గురువారం వారు సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విదేశాలకు వెళ్లడంతో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్సీ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి చిన్నారెడ్డి తెలంగాణ నుంచి సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో భారీ కమిటీలు వేసినా ప్రయోజనం కలగలేదని ముఖ్యనేతలు అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికలకు తక్కువ మంది సభ్యులతో నాలుగైదు కమిటీలు వేయాలని నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికలు జాతీయ అంశాలు, జాతీయ దృక్పథంతో ముడిపడి ఉన్నందున అదే ప్రాతిపదికన ప్రచారం చేయాలని సూచించారు. జాతీయ పార్టీలతోనే రాష్ట్ర ప్రయోజనాలు సాధ్యమనే విషయం ప్రజలకు తెలియజేయాలని సూచించారు. సోనియాగాంధీ చొరవతోనే తెలంగాణ ఏర్పడిందనే విషయం ప్రజలకు మరోసారి గుర్తుచేయాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ఛార్జీషీట్లు విడుదల చేయాలని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చేర్చేందుకు సమస్యలను గుర్తించి ఏఐసీసీకి అందజేయాలని సూచించారు.

సంస్థాగత బలోపేతమే లక్ష్యం: పొన్నం
శాసనసభ ఫలితాలతో సంబంధం లేకుండా సంస్థాగతంగా బలోపేతమే లక్ష్యంగా పని చేస్తామని పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. వార్‌ రూం సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల్లోనే రాష్ట్ర కార్యవర్గం సమావేశమై జన్‌సంపర్క్‌ అభియాన్‌తో ఇంటింటికి కాంగ్రెస్‌ విధానాలను తీసుకెళ్తామని చెప్పారు. గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ..జన్‌సంపర్క్‌ అభియాన్‌తో ఇంటింటికి కాంగ్రెస్‌ను తీసుకెళ్తామని తెలిపారు. హిందీ ప్రాబల్య రాష్ట్రాల్లో మోదీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని, భవిష్యత్తులో తెలంగాణలో ప్రజలూ ఆ విధంగానే ఆలోచిస్తారని భావిస్తున్నామన్నారు. రాహుల్‌గాంధీకి ఒక్క అవకాశం ఇవ్వాలని, రాష్ట్రంలో కనీసం 12లోక్‌సభ స్థానాలు గెలిపించాలని ప్రజల్ని కోరతామన్నారు. కాంగ్రెస్‌కు రూ.25 నుంచి రూ.2వేల వరకు విరాళాలను నగదు రూపంలో స్వీకరించనున్నట్లు చెప్పారు.

 

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.