close
రాహుల్‌కు రఫేల్‌ ఫోబియా

ఎన్డీయే 300 సీట్లు గెలుస్తుంది
కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రఫేల్‌ ఫోబియాతో బాధపడుతున్నారని కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ విమర్శించారు. ప్రధాని మోదీ పట్ల అమర్యాదగా మాట్లాడుతున్న రాహుల్‌కు తన పూర్వీకులు గుర్తుకు రావడం లేదా? అని ప్రశ్నించారు. రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీపై ఎన్ని అవినీతి ఆరోపణలున్నా తామెప్పుడూ అమర్యాదగా మాట్లాడలేదన్నారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ట్రిడెంట్‌ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవిశంకర్‌ప్రసాద్‌ మాట్లాడుతూ..యూపీఏ హయాంలో కన్నా 9 శాతం తక్కువ ధరకు యుద్ధ విమానాలు, 20 శాతం తక్కువ ధరకు ఆయుధాలను మోదీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. రఫేల్‌ ఒక కీలకమైన యుద్ధ విమానమని, దానిపై అనవసర విమర్శలు చేస్తోన్న రాహుల్‌కు దేశ రక్షణపై ఏ మాత్రం బాధ్యత లేదని మండిపడ్డారు.  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు భాజపా హవాతోనే గెలిచారని చెప్పారు. 2014లో మోదీ హవాతో, అంతకుముందు వాజ్‌పేయీ సహకారంతోనే అధికారంలోకి వచ్చారన్నారు.  అజెండా లేకుండా ‘‘మోదీ హఠావో’’ పేరుతో విపక్షాల కూటమి మరోసారి అస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు తహతహలాడుతోందని ఎద్దేవా చేశారు.

మోదీనే మళ్లీ ప్రధాని
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే 300 సీట్లు గెలుస్తుందని, మళ్లీ మోదీనే ప్రధాని అవుతారని చెప్పారు. విలేకర్ల సమావేశానికి ముందు ఆయన వివిధ ఐటీ కంపెనీల అధిపతులు, నిపుణులతో సమావేశమయ్యారు. భాజపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి పౌరుడి వద్దకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ‘‘భారత్‌ కే మన్‌కీ బాత్‌ మోదీ కే సాత్‌’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నవ భారత అభివృద్ధికి ప్రతి ఒక్కరి నుంచి సలహాలు, సూచనలను స్వీకరించేందుకు దేశవ్యాప్తంగా ఏడు వేల సూచిక బాక్సులు ఏర్పాటు చేశామని, 300 రథాలను తిప్పిస్తున్నామని చెప్పారు. ఎవరైనా 6357171717 ఫోన్‌ నంబరుకు మిస్‌డ్‌ కాల్‌ ఇచ్చి తమ సలహాలు రికార్డు చేయొచ్చన్నారు. అంతకుముందు వివిధ కంపెనీలకు చెందిన 100 మంది ఐటీ అధిపతులు, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.