close

పేటలో రాయపాటే

నరసరావుపేట లోక్‌సభ స్థానంపై ఉత్కంఠకు తెర

ఈనాడు, గుంటూరు: నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ రాయపాటి సాంబశివరావు పేరు ఖరారైంది. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పారని రాయపాటి తనయుడు రంగారావు తెలిపారు. దీంతో గురువారం ఉదయం నుంచి చోటు చేసుకున్న హైడ్రామాకు తెరపడింది. నరసరావుపేట అభ్యర్థిపై 3 రోజులుగా అధిష్ఠానం కసరత్తు చేస్తున్నా ఎంపిక కొలిక్కి రాలేదు. ఈ క్రమంలో భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ పేరు తెరపైకి రావడంతో రాయపాటి అసంతృప్తికి గురయ్యారు. దీంతో పార్టీ నేతలు సుజనా చౌదరి, టీడీ జనార్దన్‌, మంత్రులు పుల్లారావు, నారా లోకేశ్‌ విడివిడిగా ఆయనతో మాట్లాడి బుజ్జగించారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీఎస్‌ ఆంజనేయులు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. అనంతరం తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, ఎమ్మెల్సీ డొక్కా రాయపాటి వద్దకు వెళ్లి నరసరావుపేట లోక్‌సభ సీటు ఆయనకే ఖరారైందని ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది.

అంతకుముందు గురువారం ఉదయం రాయపాటి ఇంటి వద్దకు కార్యకర్తలు చేరుకోగా వారితో ఆయన సమావేశమై సమాలోచనలు జరిపారు. పార్టీ మారాలని కార్యకర్తలు డిమాండు చేశారు. ఈలోగా పార్టీ నేతలు వచ్చి చర్చలు జరపడంతో కథ సుఖాంతమైంది. ఈ విషయమై రాయపాటి రంగారావు ‘ఈనాడు’తో మాట్లాడుతూ... లోక్‌సభ సీటు తన తండ్రికి ఖరారు చేయడంతోపాటు నరసరావుపేట శాసనసభ స్థానాన్ని తాము సూచించిన ఆరవిందబాబుకే ఇస్తామన్నారని తెలిపారు.

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.