close
కాంగ్రెస్‌లో ‘రాజగోపాల్‌’ కలకలం

 ఆయన వ్యాఖ్యలపై ఆరా తీస్తున్న  పార్టీ అధిష్ఠానం
 చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ‘తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే’ అంటూ మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి, సీఎల్పీని తెరాసఎల్పీలో విలీనం చేయడంతో దెబ్బతిన్న టీపీసీసీకి రాజగోపాల్‌రెడ్డి తీరు మరింత ఇబ్బందికరంగా మారింది. పార్టీ మారుతున్నట్లు పరోక్షంగా ప్రకటించిన ఆయనపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ శ్రేణుల్లో నెలకొంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు రామచంద్ర కుంతియా రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆరా తీసినట్లు సమాచారం. కోదండరెడ్డి అధ్యక్షతన సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది. పరిషత్‌ ఎన్నికల్లో గెలిచాక పార్టీ మారిన వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏం చేయాలనే దానిపైనా ఈ భేటీలో చర్చిస్తామని కోదండరెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందని తాజా మాజీ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు వివరణ కోరగా.. భట్టివిక్రమార్క ఈ మేరకు స్పందించారు. ఆయన వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు బలమైన పునాదులు ఉన్నాయని, సీనియర్‌ నాయకులు అలా మాట్లాడటం సరికాదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఈనాడు, నల్గొండ: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు. తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని వెల్లడించారు. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు దిల్లీ వెళ్తున్న ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. పార్టీ మారతారనే ఊహాగానాలు..ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. నేను మాత్రం కాంగ్రెస్‌ను వీడను.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతాననే నమ్మకంతోనే ఎంపీగా గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను. మరో నాలుగున్నరేళ్లలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం’’ అని పేర్కొన్నారు.  రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారుతారా అని ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలియదని, అయినా కుటుంబసభ్యులు వివిధ పార్టీల్లో ఉండటం కొత్తేం కాదని జవాబిచ్చారు.

జగ్గారెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఫోన్‌
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఫోన్‌ చేయడం కాంగ్రెస్‌ వర్గాల్లో కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం ఆయనకు ఫోన్‌ చేసిన రాజగోపాల్‌రెడ్డి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. శనివారం రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు భాజపాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై జగ్గారెడ్డితో చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిని మినహాయించి మిగిలిన వారితో చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాలకు సమాచారం అందినట్లు తెలిసింది.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.