close
నాపైనా కేసు పెట్టండి

ఎంపీ కోమటిరెడ్డికి కేంద్ర మంత్రి గడ్కరీ సూచన
  జాతీయ రహదారుల నిర్మాణంలో జాప్యంపై వ్యాఖ్య
  తెలంగాణ ఎంపీలతో భేటీ
  పలు ప్రతిపాదనలు సమర్పించిన తెరాస ఎంపీలు

ఈనాడు, దిల్లీ:  జాతీయ రహదారి నిర్మాణంలో జాప్యంపై గుత్తేదారుతో పాటు తనపైన, మంత్రిత్వ శాఖ కార్యదర్శులపైన ఎఫ్‌ఐఆర్‌ (కేసు) నమోదు చేయించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. జాతీయ రహదారుల అంశంపై రాష్ట్ర ఎంపీలతో సోమవారం ఉదయం కేంద్ర మంత్రి  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నకిరేకల్‌-నాగార్జున సాగర్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-565) 2014లో ప్రారంభమై ఇప్పటికీ పూర్తి కాలేదని.. ప్రమాదాలతో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 82.676 కిలోమీటర్ల రహదారిలో 46.54 కిమీ మాత్రమే పూర్తి చేశారని పేర్కొన్నారు. భూసేకరణకు రూ.32.25 కోట్లు, రహదారి పనికి రూ.223.86 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేంద్ర మంత్రి ఆలస్యానికి, ప్రమాదాలకు మేం కారణమైనందున గుత్తేదారుతో పాటు తనపైనా, శాఖ కార్యదర్శులపైనా కేసు పెట్టాలన్నారు. మీపై ఎలా కేసు పెడతామని కోమటిరెడ్డి అనగా.. అలా కేసు పెట్టినప్పుడే ఏళ్లుగా ఆగిన పనులు మూడు రోజుల్లో ప్రారంభమవుతాయని తెలిపారు.

ఎల్‌బీనగర్‌ - అబ్దుల్లాపూర్‌మెట్‌ రహదారిని విస్తరించండి
హైదరాబాద్‌లో ఎల్‌బీనగర్‌ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు 8 వరుసలుగా రహదారి విస్తరణకు భూసేకరణ పూర్తయిందని వెంటనే పనులు చేపట్టాలని కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. త్వరలోనే పనులు ప్రారంభమయ్యేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ మూడింటిని జాతీయ రహదారులుగా గుర్తించాలి
తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో కేంద్ర మంత్రిని కలిసిన ఆ పార్టీ ఎంపీలు.. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణాలను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 3,155 కిలోమీటర్ల మేర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారని.. ఇప్పటివరకు 1,388 కిలోమీటర్ల రహదారులను మాత్రమే గుర్తించారని తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణంలో ఆలస్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలుమార్లు లేఖలు రాశారని గుర్తుచేశారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు జంక్షన్‌- వలిగొండ- తొర్రూర్‌- మహబూబాబాద్‌- ఇల్లెందు- కొత్తగూడెం; మెదక్‌- ఎల్లారెడ్డి- రుద్రూర్‌- బోధన్‌- బాసర- బైంసా; మెదక్‌- సిద్ధిపేట- ఎల్కతుర్తి మార్గాలను జాతీయ రహదారులుగా గుర్తించాలని కోరారు. చౌటుప్పల్‌- షాద్‌నగర్‌- కంది మార్గాలను రీజినల్‌ రింగ్‌ రోడ్డు దక్షిణ ప్రాంతంగా, సంగారెడ్డి- నర్సాపూర్‌- తూప్రాన్‌- గజ్వేల్‌- భువనగిరి- చౌటుప్పల్‌ను రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర ప్రాంతంగా గుర్తించి ఈ రెండింటిని అనుసంధానించాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర ప్రాంతాన్ని ఇప్పటికే ఎన్‌హెచ్‌-161 ఏఏగా ప్రకటించారని మంత్రికి తెలిపారు. జాతీయ రహదారులకు భూసేకరణ, నిర్వాసితుల తరలింపు, అటవీ భూముల మళ్లింపులో 50 శాతం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారని వివరించారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో పెద్దపల్లి ఎంపీ డాక్టర్‌ వెంకటేశ్‌ నేత, నాగర్‌కర్నూల్‌ ఎంపీ పి.రాములు, మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.