close
ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర

ఆరోపించిన విపక్షాలు

ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌, న్యూస్‌టుడే: విధులకు హాజరుకాని ఆర్టీసీ కార్మికులను ఇకపై ఉద్యోగాల్లోకి తీసుకోబోమని, సంస్థలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచుతామంటూ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఉద్దేశపూర్వకంగా కార్మికులు సమ్మెలోకి వెళ్లేలా ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందని మండిపడ్డాయి. సంస్థ ఆస్తులను అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ప్రజా రవాణా సంస్థను నష్టాల ఊబిలోకి నెట్టాయని ధ్వజమెత్తాయి. సమ్మె చేస్తామని రెండు నెలలుగా చెబుతున్న ఐకాస నాయకులతో చర్చించే తీరిక సీఎంకు లేదా? అని నిలదీశాయి. ఈ విషయమై వివిధ పక్షాల నేతలు సోమవారం వేర్వేరు వేదికల్లో మాట్లాడారు. ఎవరెవరు ఏమన్నారంటే..

 కార్మికులను రెచ్చగొట్టి సమ్మెకు వెళ్లేలా చేశారు: భట్టి
కార్మికులను కావాలనే రెచ్చగొట్టి, సమ్మెకు వెళ్లేలా ప్రభుత్వం కుట్ర పన్నింది. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతోంది. ఇప్పటికే వరంగల్‌తో పాటు పలు ప్రాంతాల్లోని డిపోలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినట్లు తెలుస్తోంది. కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యతను సర్కారు విస్మరించింది. కార్మికులను తొలగిస్తున్నానంటూ ప్రకటన చేయడం దేశ చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. సీఎం కేసీఆర్‌ అహంభావంతో వ్యవహరిస్తున్నారు.

కాళ్లకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్నారుగా: లక్ష్మణ్‌
ఆర్టీసీ కార్మికుల కాళ్లకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇప్పుడు వారి గుండెల్లో గునపాలు దించారు. వారి విషయంలో కేసీఆర్‌ యూటర్న్‌ తీసుకున్నారు. గతంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న సీఎంలకు ఎలాంటి పరాభవం జరిగిందో ఆయన తెలుసుకోవాలి. అందర్నీ బెదిరిస్తూ పోతే చివరికి కాలేది మీ చేతులే. సమ్మె విషయంలో సీఎం తీరు ప్రభుత్వ పతనానికి నాంది కాబోతోంది. భవిష్యత్తులో ఆర్టీసీలో యూనియన్లే ఉండకూడదని సీఎం కేసీఆర్‌ మాట్లాడటం దారుణం. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక దుర్దినం. అధికారం ఉంది కదా? అని ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం సరికాదు.

సచివాలయానికి రాని సీఎంపై పీడీ యాక్టు పెడతారా: రేవంత్‌
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి సీఎం కేసీఆర్‌ పక్కా ప్రణాళిక రచించారు. దీనికి నాలుగేళ్ల క్రితమే బీజం వేశారు. తెరాస అధికారంలోకి వచ్చాక డీజిల్‌పై వ్యాట్‌ను 22.25 నుంచి 27 శాతానికి పెంచడం ద్వారా సంస్థపై ఏడాదికి రూ.600 కోట్ల భారం మోపారు. డీజిల్‌పై వ్యాట్‌, విడి పరికరాలపై పన్ను మినహాయిస్తే ఆర్టీసీకి ఏడాదికి రూ.750 కోట్లు మిగులుతాయి. వివిధ రకాల బస్‌ పాస్‌ల రాయితీలకుగానూ ప్రభుత్వం సంస్థకు ఏడాదికి దాదాపు రూ.700 కోట్లు చెల్లించాల్సి ఉన్నా మూడేళ్లుగా చెల్లించడం లేదు. అవీ చెల్లిస్తే సంస్థకు ఏడాదికి రూ.1450 కోట్లు సమకూరుతుంది. రెండు రోజులు విధులకు రాని కార్మికులను ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటోంది. ఐదేళ్లుగా సచివాలయానికి రాని సీఎంపై పీడీ యాక్టు పెట్టి అండమాన్‌ జైలుకు పంపాలా?

ఉద్యోగుల తొలగింపు అప్రజాస్వామికం: తమ్మినేని వీరభద్రం
సీఎం భూస్వామ్య మనస్తత్వంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమ్మె, చట్టం అంటే ఏమిటో తెలియకుండా వ్యవహరిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌, కేరళలో ఆర్టీసీని విలీనం చేశారా? ఆయన ప్రశ్నిస్తున్నారు. అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఏ నిర్ణయాలు తీసుకున్నారో రుజువుకు సిద్ధంగా ఉన్నాం.
కక్ష సాధింపు సరికాదు: చాడ వెంకటరెడ్డి
సమ్మెపై ప్రభుత్వం కక్షసాధింపును తలపిస్తోంది. కేసీఆర్‌ మొండిగా వ్యవహరిస్తే కార్మికులతోపాటు ప్రజల నుంచి కూడా దూరమవుతారు. ఒక్క కలం పోటుతో 40 వేల పైచిలుకు ఉద్యోగులను తొలగిస్తారా? అది సాధ్యమా?
కార్మికుల తొలగింపు ఆందోళనకరం: పవన్‌కల్యాణ్‌
కార్మికుల తొలగింపు నిర్ణయం ఆందోళనకరం. వారి సమస్యలను సానుభూతితో పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తగదు.

మిలిటెంట్‌ ఉద్యమాలు చేపట్టండి: మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్‌
ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించాలి. సిబ్బందిపై నియంతృత్వ విధానాలను తక్షణమే నిలిపివేయాలి. ప్రభుత్వం కావాలనే ఆర్టీసీని నిర్లక్ష్యానికి గురిచేస్తూ నష్టాలపాలు చేస్తోంది.  కార్మికులే కారణమంటూ ప్రచారం చేస్తోంది. తమ డిమాండ్లను సాధించే వరకు కార్మికులు మిలిటెంట్‌ ఉద్యమాలు కొనసాగించాలి.
*  పౌర హక్కుల సంఘం, విప్లవ రచయితల సంఘం కూడా కార్మికులకు మద్దతు పలికాయి.

సంస్థను కాపాడుకునేందుకే పోరాటం: ఎన్‌ఎంయూ
కార్మికుల సమస్యలు పరిష్కరించుకోవడంతోపాటు, సంస్థను కాపాడుకోడానికే పోరాటం చేస్తున్నామని, నష్టాలకు కార్మికులను బాధ్యులను చేయడం సరికాదని నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు మౌలానా తదితరులు పేర్కొన్నారు. సమ్మెకు మద్దతివ్వాలని కోరుతూ సోమవారం వారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను కలిశారు.
*  ఉద్యోగాలు తొలగిస్తామని భయపెడితే, భయపడే పరిస్థితిలో లేమని,  అదే జరిగితే అమరణ నిరాహార దీక్ష చేస్తామని ఐకాస-1 కన్వీనర్‌ హనుమంతు తెలిపారు. సకల జనుల సమ్మెలా పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు.
*  సీఎం భయపడే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటన చేస్తున్నారని ఆచార్య హరగోపాల్‌  పేర్కొన్నారు. రాష్ట్ర సాధనతోనే ఆర్టీసీ కార్మికులకు పోరాట పటిమ వచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తించాలన్నారు.
*  నష్టాలు చూపి సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు.
‘కార్మిక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు వీడాలి’
ఈనాడు, దిల్లీ: తొలగించిన ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, సంఘాలు లేవనెత్తిన అంశాలపై చర్చించాలని భారత కార్మిక సంఘాల కేంద్రం (సీఐటీయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ డిమాండ్‌ చేశారు.

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.