close
సాగుతున్న మహా నాటకం

  ప్రభుత్వ ఏర్పాటుపై తొలగని ప్రతిష్టంభన
  గవర్నర్‌ కోశ్యారీతో భాజపా ప్రతినిధుల భేటీ
  సీఎం పదవిపై పట్టువీడని శివసేన
  హోటల్‌లో ఎమ్మెల్యేలు

ముంబయి: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన డైలీ సీరియల్‌లా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ గడువు శనివారంతో ముగియనున్నప్పటికీ నూతన ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా స్పష్టత రావట్లేదు. భాజపా ప్రతినిధుల బృందం గురువారం గవర్నర్‌తో భేటీ కావడంతో అనిశ్చితికి తెరపడబోతోందని ఆశించిన వారందరికీ నిరాశే ఎదురైంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని గవర్నర్‌ను భాజపా కోరలేదు. మరోవైపు, సీఎం పీఠం కోసం పట్టిన పట్టును శివసేన వీడట్లేదు.

చట్టపరమైన అంశాలపై గవర్నర్‌తో చర్చ
మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ నేతృత్వంలో కమలదళ బృందం ముంబయిలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలిసింది. అనంతరం పాటిల్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వెనుక చట్టపరమైన అంశాలపై గవర్నర్‌తో చర్చించామన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యానికి కారణమవుతున్న పరిస్థితులను ఆయనకు వివరించామన్నారు.

శివసేన ఎమ్మెల్యేల భేటీ
ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీ తరఫున తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని తమ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేకు అప్పగిస్తూ శివసేన ఎమ్మెల్యేలు తీర్మానం ఆమోదించారు. ఠాక్రే అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు గురువారం సమావేశమయ్యారు. సీఎం పదవినిచ్చేందుకు సిద్ధంగా ఉంటేనే భాజపా తమను సంప్రదించాలని ఠాక్రే స్పష్టీకరించారని తెలుస్తోంది. శివసేన తమ ఎమ్మెల్యేలందర్నీ సబర్బన్‌ బాంద్రాలోని రంగ్‌శారదా హోటల్‌కు తరలించింది.

మాకు సంఖ్యాబలం ఉంది

భాజపాకు సంఖ్యాబలం లేదు. ప్రభుత్వ ఏర్పాటుపై చేతులెత్తేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటిస్తే.. మేం తదుపరి చర్యలు ప్రారంభిస్తాం. మాకు సంఖ్యాబలముంది. ఆ సంగతి అసెంబ్లీలో తేలుతుంది. మా పార్టీ నేత సీఎం పదవిని చేపట్టబోతున్నారు.
- శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌

రాష్ట్రరాజకీయాల్లోకి రాను

మహారాష్ట్రలో దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలో నూతన ప్రభుత్వం కొలువుదీరుతుంది. అందులో శివసేన కూడా భాగస్వామిగా ఉంటుంది. నేను రాష్ట్ర రాజకీయాల్లోకి రాను. కేంద్ర రాజకీయాల్లోనే ఉంటా.
- కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.