ఎంపీ రఘురామకు 28 వరకు రిమాండ్‌
close

తాజా వార్తలు

Published : 16/05/2021 00:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంపీ రఘురామకు 28 వరకు రిమాండ్‌

గుంటూరు: ఎంపీ రఘురామకృష్ణరాజుకు గుంటూరులోని సీఐడీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ నెల 28 వరకు ఆయనను రిమాండ్‌కు తరలించాలని ఆదేశించింది. ఆయన కాళ్లపై గాయాలు ఉండటంతో ఎంపీని ఆస్పత్రికి తరలించాలని, ముందుగా జీజీహెచ్‌.. ఆ తర్వాత రమేశ్‌ ఆస్పత్రికి తరలించాలని సూచించింది. ఆయన కోలుకొనే వరకు ఆస్పత్రిలో ఉండొచ్చని తెలిపింది. ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతున్నంత వరకు ఆయనకు వై కేటగిరీ భద్రత కొనసాగుతుందని తెలిపింది. ఆయన శరీరంపై కనిపిస్తున్న గాయాలపై న్యాయస్థానం నివేదిక కోరింది. రెండు ఆస్పత్రుల్లో మెడికల్‌ ఎగ్జామినేషన్‌కు కోర్టు ఆదేశించింది.

సీఐడీ కోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
ఎంపీ రఘురామ కేసులో సీఐడీ కోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సీఐడీ విచారణలో కొందరు తనపై దాడి చేశారని నిందితుడు చెప్పారు. ఐదుగురు వ్యక్తులు రబ్బరు కర్రలతో దాడి చేసినట్టు చెప్పారు. తాళ్లతో కాళ్లు కట్టేసి దాడి చేసినట్టు రఘురామ తెలిపారు. నిందితుడి గాయాలను తాను పరిశీలించాను. గాయపడిన నిందితుడికి వైద్య పరీక్షలు అవసరం. గుంటూరు జీజీహెచ్‌, రమేశ్‌ ఆస్పత్రి వైద్యులు నివేదిక ఇవ్వాలి. నిందితుడికి వై కేటగిరీ భద్రత మధ్య వైద్య పరీక్షలు జరపాలి’’ అని న్యాయమూర్తి తెలిపారు.

కోర్టులో రఘురామ కథ అల్లారు..: ఏఏజీ 

మరోవైపు, ఎంపీ రఘురామ కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని అదనపు అడ్వొకేట్‌ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి అన్నారు. బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిందని, మధ్యాహ్నం కుటుంబ సభ్యులు భోజనం కూడా తెచ్చారని వివరించారు. అప్పటివరకు రఘురామ మామూలుగానే ఉన్నారని, పిటిషన్‌ డిస్మిస్‌ కాగానే కొత్త నాటకానికి తెరతీశారని చెప్పారు. పోలీసులు తనను కొట్టారంటూ సాయంత్రం కోర్టులో కథ అల్లారన్నారు. రఘురామ ఆరోపణలపై కోర్టు మెడికల్‌ కమిటీ వేసిందని ఏఏజీ తెలిపారు. రేపు మధ్యాహ్నంలోగా కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించిందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని