close

తాజా వార్తలు

Updated : 25/11/2020 11:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూత

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌ పటేల్‌(71) కరోనాతో చికిత్స పొందుతూ గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. బుధవారం తెల్లవారుజామన 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మరణించారని ఆయన తనయుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అహ్మద్ పటేల్‌కు నెల రోజులు క్రితం కరోనా సోకింది. గత కొద్దిరోజులుగా శరీరంలోని పలు అవయవాలు సరిగా పని చేయకపోవడం (మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్)తో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నెల 15 నుంచి ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. 

గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన అహ్మద్‌ పటేల్‌ సుదీర్ఘ కాలం సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు. ఎనిమిది సార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మూడుసార్లు లోక్‌సభ, అయిదు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో కీలక వ్యూహకర్తగా వ్యవహరించిన ఆయన పార్టీలోని అంతర్గత విభేదాలను పరిష్కరించడంలో దిట్టగా పేరుగాంచారు.

ప్రముఖుల సంతాపం..

అహ్మద్‌ పటేల్‌ మరణంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీతో ఇతర ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పటేల్‌ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.

‘‘ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ ఇక లేరన్న వార్త నన్ను తీవ్రంగా బాధించింది. చురుకైన పార్లమెంటు సభ్యుడిగా పటేల్ ఒక వ్యూహకర్త నైపుణ్యాలను, ప్రజానాయకుడిగా లభించిన ఆదరణను మిళితం చేసి పనిచేశారు. అయన స్నేహభావం పార్టీలకతీతంగా ఆయనకు మిత్రులను సాధించి పెట్టింది. ఆయన కుటుంబానికి, స్నేహితులకు నా సంతాపం.’’ - రామ్‌నాథ్‌ కోవింద్‌, రాష్ట్రపతి


రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌ పటేల్‌ ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యాను. ఆయన ఒక గొప్ప పార్లమెంటేరియన్‌. పార్టీలకతీతంగా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన కుటుంబానికి నా సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. - వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి  

 ‘‘అహ్మద్ పటేల్ మరణం నన్ను తీవ్రంగా బాధించింది. జీవితమంతా ప్రజాసేవలోనే గడిపారు. చురుకైన వ్యక్తిగా కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన నేతగా ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన కుమారుడు ఫైసల్‌తో మాట్లాడి సంతాపం తెలియజేశాను. అహ్మద్ భాయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.’’ - మోదీ, ప్రధాని

‘‘అహ్మద్‌ పటేల్‌ ఇక లేరు. అత్యంత విశ్వసనీయ వ్యక్తి అయిన ఆయనతో నాకు ఎంతో కాలంగా సాన్నిహిత్యం ఉంది. మృదుభాషిగా, ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆయన చిరస్మరణీయులు. ఆయన వద్దకు ఎంత కోపంతో వెళ్లినా వారి శాంతపరిచి పంపేవారు. మీడియాకు దూరంగా ఉండేవారు. కానీ, కాంగ్రెస్‌ తీసుకునే ప్రతి కీలక నిర్ణయంలో ఆయన పాత్ర ఉండేది. చేదు మాటల్ని సైతం తీయని పదాలతో చెప్పే నేర్పరితనం ఆయనది. ఆయన అత్యంత ఆధ్యాత్మికత కలిగిన వ్యక్తి. నమాజ్‌ చేయడాన్ని ఎప్పుడూ మరిచేవారు కాదు. ఆయన సేవల్ని కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికీ మరవదు. ఆయన అమరుడు. అల్లా ఆశీస్సులతో ఆయనకు స్వర్గం ప్రాప్తించాలని ప్రార్థిస్తున్నాను.’’ - దిగ్విజయ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతTags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన