close

తాజా వార్తలు

Published : 16/07/2020 03:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆంగ్లం మాట్లాడితే సరిపోదు..!

సచిన్‌ పైలట్‌పై అశోక గహ్లోత్‌ విమర్శలు

జైపుర్‌: కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత, రాజస్థాన్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తీవ్ర విమర్శలు చేశారు. అందంగా కనిపించడం, ఆంగ్ల బాగా మాట్లాడం ఒక్కటే సరిపోవని పైలట్‌ను ఎద్దేవా చేశారు. తన ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు పైలట్‌ ప్రయత్నించారని ఆరోపించారు. ‘‘మంచి ఇంగ్లిష్ మాట్లాడటం, మంచి మాటలు చెప్పడం, అందంగా కనిపించడం మాత్రమే సరిపోవు. దేశం కోసం మీ హృదయంలో ఏముంది, మీ ఆలోచనలు, విధానాలు, నిబద్ధత లాంటివి ఎంతో ముఖ్యం. బంగారంతో చేశారని కత్తిని భోజనం చేయడం కోసం వాడరు, మీకు నా భావం అర్ధమవుతుందా’’ అని పైలట్‌ను ఉద్దేశించి గహ్లోత్‌ అన్నారు.

అలానే  కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని గహ్లోత్ వెల్లడించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్ల ముట్టజెప్పేందుకు ప్రయత్నించారని అన్నారు. ‘‘నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. కొత్త తరాన్ని మేము ఎంతో  ప్రేమిస్తాం. భవిష్యత్తు వారిదే. కొత్త తరానికి చెందిన వారు కేంద్ర మంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు. మా తరంలో మేం అనుభవించిన వాటిని వారు ఎదుర్కొని ఉంటే, వాళ్లు అర్ధం చేసుకునేవారు’’ అని గహ్లోత్ అన్నారు.

 మంగళవారం జరిగిన రెండో విడత కాంగ్రెస్‌ శాసనసభా పక్ష (సీఎల్పీ) భేటీకి కూడా సచిన్‌ పైలట్‌, అతని వర్గం ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో పార్టీ అధిష్టానం వారిపై వేటువేసిన సంగతి తెలిసిందే. పైలట్‌తోపాటు అతని సన్నిహితులైన ఇద్దరు మంత్రులను కూడా మంత్రి పదవుల నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో సచిన్‌ పైలట్‌తో పాటు 18 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు రాజస్ధాన్‌ స్పీకర్‌ నోటీసులు జారీ చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్‌ పార్టీ కోరిన మీదట స్పీకర్‌ ఈ నోటీసులు జారీ చేసి శుక్రవారం లోగా వారు బదులివ్వాలని ఆదేశించారు.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని