ఆ ఓట్లతోనే ఎన్డీయే 15సీట్లు గెలుచుకోగలిగింది!

తాజా వార్తలు

Updated : 12/11/2020 16:39 IST

ఆ ఓట్లతోనే ఎన్డీయే 15సీట్లు గెలుచుకోగలిగింది!

అక్కడ పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించాలని తేజస్వీ డిమాండ్‌

పట్నా: బిహార్‌ పీఠంపై నీతీశ్‌ కుమార్‌ కూర్చున్నా.. ప్రజల హృదయాల్లో మాత్రం తామే ఉంటామని ఆర్జేడీ నేత, మహా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ అన్నారు. గురువారం ఆయన మహాకూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన సందర్భంగా మాట్లాడారు. ప్రజా తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని, సీఎం కుర్చీలో ఎవరు కూర్చున్నా తానే విజేతనన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, నీతీశ్‌ కుమార్‌ ఈ ఎన్నికల్లో ధన బలం, కండబలంతో పాటు అనేక ఎత్తుగడలు వేసినా 31 ఏళ్ల యువకుడినైన తనను ఆపలేకపోయారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్జేడీనే అతి పెద్ద పార్టీగా అవతరించడాన్ని ఆపలేరన్నారు. ‘నీతీశ్‌ జనాకర్షణ ఎక్కడికి పోయిందో చూడండి. ఆయన మూడో స్థానానికి పరిమితమయ్యారు. మార్పునకు ఇదో తీర్పు. నీతీశ్‌ కుమార్‌ సీఎం కుర్చీపై కూర్చున్నా.. ప్రజల హృదయాల్లో మాత్రం మనమే ఉంటాం’’ అని అన్నారు. 

ఎన్డీయే-మహాకూటమికి ఓట్ల తేడా 12,720 మాత్రమే

ఎన్డీయేకి, తమకు మధ్య ఓట్ల తేడా కేవలం 12,720 మాత్రమేనని తేజస్వీ వివరించారు. ఆ ఓట్లతోనే 15 సీట్లను ఎన్డీయే గెలుచుకోగలిగిందన్నారు. చాలా తక్కువ ఓట్ల తేడాతోనే 20సీట్లు తాము ఓడిపోయామన్నారు. అనేక పోలింగ్ కేంద్రాల్లో 900 పోస్టల్‌ ఓట్లను చెల్లనివిగా రద్దుచేశారని, ఇంత భారీ సంఖ్యలో ఆ ఓట్లను ఎవరి ఒత్తిడికి తలొగ్గి రద్దు చేశారని ప్రశ్నించారు. అలా రద్దుచేసినచోట తిరిగి రీకౌంటింగ్‌ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కండబలం, ధనబలంతోనే ఎన్డీయే గెలిచిందన్నారు. ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన నీతీశ్‌ కుమార్‌ తన ఆత్మప్రబోధానుసారం సీఎం పీఠానికి దూరంగా ఉంటారా? అని ప్రశ్నించారు.  

నీతీశ్‌ దొడ్డిదారిన సీఎం అవ్వాలనుకుంటున్నారు

తమకు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల మద్దతు తమకే వున్నా.. అధికారం చేపట్టలేకపోయామన్నారు. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదని, 2015లో కూడా మహా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ భాజపా దొడ్డిదారిన వచ్చి అధికారాన్ని కైవసం చేసుకుందని దుయ్యబట్టారు. తమ అభ్యర్థులు 20 చోట్ల స్వల్ప వ్యవధితోనే ఓడిపోయారని, పోస్టల్‌ బ్యాలెట్లను రీకౌంటింగ్ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజా మద్దతు పొందలేకపోయిన నీతీశ్‌ దొడ్డిదారిన సీఎం అవ్వాలనుకుంటున్నారని విమర్శించారు. పోస్టల్‌ బ్యాలెట్లను ముందుగా ఎందుకు లెక్కించలేదని అధికారులను ప్రశ్నించారు. చాలా చోట్ల అవి చెల్లవని కూడా ప్రకటించారన్నారు.  అనేక నియోజకవర్గాల్లో 900 కంటే ఎక్కువ పోస్టల్‌ బ్యాలెట్లను చెల్లనివిగా ప్రకటించడంపై సందేహం వ్యక్తంచేశారు.

బిహార్‌ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. మొత్తం 243 స్థానాలకు ఆర్జేడీ 75 స్థానాలు గెలుచుకొని అతి పెద్ద పార్టీగా అవతరించగా.. భాజపాకు 74 స్థానాలు వచ్చాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ (122) కాగా.. ఎన్డీయే కూటమి (భాజపా- జేడీయూ-హెచ్‌ఏఎమ్‌-వీఐపీ) 125 స్థానాలు గెలుచుకుంది. నీతీశ్‌ కుమార్‌కు చెందిన జేడీయూ 43 స్థానాలతో మూడో స్థానానికే పరిమితమైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని