వాళ్లకు కావాల్సిన బిల్లులను ఆమోదించారు: భట్టి

తాజా వార్తలు

Updated : 13/10/2020 18:18 IST

వాళ్లకు కావాల్సిన బిల్లులను ఆమోదించారు: భట్టి

హైదరాబాద్‌: శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబుతో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. శాసనసభలో కనీస నియమ నిబంధనలు, సంప్రదాయాలు పాటించకపోవడం ఎంతో బాధించిందన్నారు. ప్రజావసరాల కోసం కాకుండా ప్రభుత్వ అవసరాల కోసమే సభ నిర్వహించారని భట్టి ఆరోపించారు. సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి వాళ్లకు కావాల్సిన బిల్లులను ఆమోదించారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే చేసిన తర్వాతే ‘ధరణి’లో భూముల వివరాలు నమోదు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ మాట తప్పారని భట్టి ఆరోపించారు.

అభివృద్ధి ఎక్కడైనా కనిపిస్తోందా?: జగ్గారెడ్డి
‘‘శాసనసభ సమావేశాలకు ఒక విధానమంటూ ఏం లేదు. ఎలాంటి అజెండా లేకుండా సమావేశాలు నిర్వహించడం ఏంటో అర్థం కావడం లేదు. శాసనసభ సమావేశాలను పాఠశాల సమావేశాల మాదిరిగా మార్చేశారు. రూ. 72 వేల కోట్లు హైదరాబాద్ అభివృద్ధికి ఖర్చు చేశారంటే ప్రజలు నమ్ముతారా ? కూకట్‌పల్లి అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే  చెబుతున్నారు. అభివృద్ధి ఎక్కడైనా కనిపిస్తుందా? ఇంత హడావుడిగా చట్టాల్లో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది?’’ అని వ్యాఖ్యానించారు.

ఇప్పటివరకు మహిళా కమిషన్‌ లేదు: సీతక్క
‘‘శాసనసభ సమావేశాలు ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం కాకుండా బిల్లుల ఆమోదం కోసమే అన్నట్లుగా ఉంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో పంట నష్టం జరిగితే రైతులకు భరోసా ఇచ్చే విధంగా సీఎం కేసీఆర్‌ వ్యవహరించడం లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు మహిళా కమిషన్ ఏర్పాటు చేయలేదు. 
మహిళలపై దాడులు జరుగుతుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. సభలో సంబంధం లేని విషయాలను ప్రస్తావించి ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్‌ అనవసర విమర్శలు చేస్తున్నారు’’ అని అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని