‘జనగణమన రాని వ్యక్తికి విద్యాశాఖా?’

తాజా వార్తలు

Published : 19/11/2020 11:47 IST

‘జనగణమన రాని వ్యక్తికి విద్యాశాఖా?’

బిహార్‌ ప్రభుత్వంపై ఆర్జేడీ చురకలు

పట్నా: బిహార్‌ కొత్త ప్రభుత్వంలో జేడీయూ మంత్రి మేవాలాల్‌ చౌధరీకి విద్యాశాఖ బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదంగా మారింది. కనీసం జాతీయ గీతం కూడా పాడటం రాని మేవాలాల్‌కు కీలకమైన విద్యాశాఖ కేటాయించడంపై ప్రతిపక్ష రాష్ట్రీయ జనతా దళ్ ‌(ఆర్జేడీ) తీవ్రంగా మండిపడింది. సదరు మంత్రి జనగణమన పాడటానికి ఇబ్బందిపడుతున్న ఓ పాత వీడియోను ట్వీట్‌ చేసి ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. 

అవినీతి, క్రిమినల్‌ కేసులున్న మేవాలాల్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడాన్ని ఆర్జేడీ తప్పుబట్టింది. ఈ విషయమై నీతీశ్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ప్రతిపక్ష పార్టీ.. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ పాత వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. అందులో ఓ జాతీయపతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మేవాలాల్‌.. జాతీయగీతాన్ని పూర్తిగా పాడలేకపోయారు. మధ్యలో కొన్ని లైన్లు పాడకుండానే జయహే అంటూ ముగించారు. ఈ వీడియోను పోస్ట్‌ చేసిన ఆర్జేడీ..‘బిహార్‌ విద్యాశాఖ మంత్రి మేవాలాల్‌ చౌధరీ.. అనేక అవినీతి కేసుల్లో నిందితుడు.. కనీసం జాతీయ గీతం కూడా తెలియని వ్యక్తి. నీతీశ్ కుమార్‌జీ.. ఇంతకంటే సిగ్గుచేటు ఏమైనా ఉందా?’ అని ప్రభుత్వాన్ని విమర్శించింది. 

బిహార్‌లో భాజపా-జేడీయూ ప్రభుత్వం సోమవారం కొలువుదీరింది. జేడీయూ నేత నీతీశ్ కుమార్‌ ఏడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అదే రోజు నీతీశ్‌తో పాటు మరో 14 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే వీరిలో సగానికిపైగా మంత్రులపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదికలో తేలింది. దీంతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన అధికార బలంతో సీఎం క్రిమినల్స్‌ను కాపాడుతున్నారని ఆరోపించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని