ఆయనే సీఎం.. ఎలాంటి సందేహం లేదు..
close

తాజా వార్తలు

Published : 13/10/2020 15:52 IST

ఆయనే సీఎం.. ఎలాంటి సందేహం లేదు..

8 మంది రెబల్స్‌పై భాజపా వేటు

పట్నా: బిహార్‌లో ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ పరిణామాలు మారుతున్నాయి. ఎన్డీయే కూటమి నుంచి చిరాగ్‌ పాసవాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీ ఇప్పటికే వేరుకుంపటి పెట్టుకున్న విషయం తెలిసిందే. మరి కొందరు రెబల్స్‌ ఎల్‌జేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఊహాగానాలు వినిపించడంతో భాజపా గత వారమే వారిని హెచ్చరించింది. పార్టీ కోసం పని చేయాలని సూచించింది. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పార్టీ అధిష్ఠానం తాజాగా 8 మంది నేతలపై వేటు వేసింది. వారిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు భాజపా సీనియర్‌ నేత, ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ వెల్లడించారు.

జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌, ఎల్‌జేపీ అధినేత చిరాగ్‌ పాసవాన్‌ మధ్య విభేదాలు తలెత్తినప్పటికీ రెండూ తనకు మిత్రపక్షాలైన నేపథ్యంలో భాజపా మిన్నకుండిపోయింది. అంతేకాకుండా భవిష్యత్‌లో కాషాయపార్టీతో కలిసి ఎల్‌జేపీ అడుగులేస్తుందన్న వార్తలూ వచ్చాయి.  అయితే తాజాగా సుశీల్‌కుమార్‌ మోదీ దీనిపై స్పష్టతనిచ్చారు. ఎల్‌జేపీ తిరిగి ఎన్డీయేతో కలిసే అవకాశమే లేదన్నారు. ‘‘ ఒక వేళ ఎన్డీయే మెజార్టీ సాధిస్తే జేడీయూకు చెందిన నితీశ్‌కుమార్‌నే తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. దీనిపై ఎలాంటి సందేహం లేదు. ఆరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు నితీశ్‌కుమార్‌కు భాజపా అన్ని విధాలా సాయం చేస్తుంది.’’ అని సుశీల్‌కుమార్‌ మోదీ అన్నారు.

మరోవైపు దివంగత కేంద్రమంత్రి రామ్‌విలాస్‌ పాసవాన్‌ కన్నుమూయక ముందే ఎన్డీయే నుంచి ఎల్‌జేపీ బయటకొచ్చిన విషయం తెలిసిందే. అయితే భాజపాతో తమకెలాంటి భేదాభిప్రాయాలు లేవని, జేడీయూ వైఖరితో విసిగిపోయే కూటమి నుంచి బయటకొస్తున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్‌పాసవాన్‌ వెల్లడించారు. అంతేకాకుండా భవిష్యత్‌లో భాజపాకు గట్టి మిత్రపక్షంగా మారుతామని కూడా చెప్పారు. దీంతో ఎల్‌జేపీ ఎన్నికల తర్వాత భాజపాతో కలుస్తుందని చాలా మంది భావించారు. ఈ నేపథ్యంలో తాజాగా సుశీల్‌కుమార్‌ మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రధాన్యత సంతరించుకున్నాయి.  8 మంది రెబల్స్‌పై భాజపా చర్యలు తీసుకోవడం ఆ పార్టీలోనూ చర్చలకు తావిస్తోంది. భవిష్యత్‌లో ఎవరైనా తిరుగుబాటుబావుటా ఎగరేస్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని పార్టీ పరోక్షంగా హెచ్చరించినట్లయింది. రాష్ట్రంలోని 243 శాసనసభ స్థానాలకు అక్టోబర్‌ 28 నుంచి మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని