నూతన భవనాలు వద్దని మేం చెప్పామా?: ఉత్తమ్‌

తాజా వార్తలు

Published : 26/07/2020 03:00 IST

నూతన భవనాలు వద్దని మేం చెప్పామా?: ఉత్తమ్‌

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరిందని విమర్శించారు. ప్రజారోగ్యంపై మాట్లాడమంటే అధికార పక్షం నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌తోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు ఇవాళ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. సూపరింటెండెంట్‌ను కలిసి.. ఆస్పత్రి తరలింపు, భవనం కూల్చివేత, వైద్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి ఆస్పత్రి వార్డుల్లోకి నీరు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలోని ఇబ్బందులు, కూల్చివేతతోపాటు తదితర వివరాలను నేతలు తెలుసుకున్నారు. 

ఉస్మానియా ఆస్పత్రికోసం కొత్త భవనాలు నిర్మించాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. ఉస్మానియా నూతన భవనాలు నిర్మించొద్దని కాంగ్రెస్‌ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత భవనాన్ని కూల్చకుండా ఖాళీ స్థలంలో నూతనంగా నిర్మించాలని కోరామన్నారు. ‘‘ నిజాం హయాంలో అర్భుతమైన భవనాలు నిర్మించారు. తెరాస ప్రభుత్వం మరమ్మతులకు రూపాయి కూడా కేటాయించలేదు. నిజాం కట్టిన భనాలను కూల్చే ఆలోచనను విరమించుకోవాలి. చారిత్రక భవనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఖాళీగా ఉన్న 6 ఎకరాల స్థలంలో కొత్త భవనాలు నిర్మించాలి.’’ అని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. సచివాలయం నూతన భవనాల పేరిట నిధులు వృథా చేస్తున్నారని విమర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని