బంతిని గవర్నర్‌ కోర్టులోకి నెట్టిన గహ్లోత్‌!

తాజా వార్తలు

Published : 25/07/2020 00:31 IST

బంతిని గవర్నర్‌ కోర్టులోకి నెట్టిన గహ్లోత్‌!

ప్రజలు రాజ్‌భవన్‌ను ముట్టడిస్తే మాకు సంబంధం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు

జైపుర్‌: రాజస్థాన్‌ రాజకీయం క్షణక్షణం ఆసక్తిగా మారుతోంది. తాజా పరిణామాలు సీఎం అశోక్‌ గహ్లోత్‌ వర్సెస్‌ గవర్నర్‌ అన్నట్లుగా మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ సెషన్‌ కీలకంగా మారడంతో గహ్లోత్‌ సమావేశాల నిర్వహణకు పట్టుబడుతున్నారు. దీనిపై సీఎం మాట్లాడుతూ.. పదే పదే పట్టుబడుతున్నా.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చేందుకు గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా వెనకాడుతున్నారని ఆరోపించారు. గవర్నర్‌పై పై స్థాయి నుంచి ఒత్తిడి ఉందని.. అందువల్లే ఆయన నిర్ణయం తీసుకోలేకపోతున్నారన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలు రాజ్‌భవన్‌ని చుట్టుముడితే.. తమకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు.  నిన్న సాయంత్రమే సమావేశాల నిర్వహణకు పిలుపునివ్వాలని కోరామని.. అయినా ఇప్పటి వరకూ గవర్నర్‌ కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదని తెలిపారు.  తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ వర్గం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై యథాతథస్థితి కొనసాగించాలని రాజస్థాన్‌ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన కొన్ని నిమిషాల్లోనే సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

అసెంబ్లీ సమావేశాల్ని వెంటనే ప్రారంభించాలని గహ్లోత్‌ డిమాండ్‌ చేశారు. అప్పుడే ఎవరికి ఆధిక్యం ఉందో స్పష్టమవుతుందని వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటికే తాను గవర్నర్‌తో ఫోన్‌లో మాట్లాడానన్నారు. మరికాసేపట్లో ఆయన్ని కలుస్తామన్నారు. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు కొవిడ్‌ కట్టడిపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిందేనన్నారు. ఎమ్మెల్యేలందరితో కలిసి గవర్నర్‌ని కలవబోతున్నామన్నారు. 

ఇదంతా భాజపా ఆడుతున్న నాటకమని గహ్లోత్‌ ఆరోపించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో వలే ఇక్కడా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు యత్నిస్తోందన్నారు. కావాలనే తమ ఎమ్మెల్యేల్ని భాజపా పాలిత రాష్ట్రంలో బంధించారన్నారు. సచిన్‌ వర్గంలోని చాలా మంది ఎమ్మెల్యేలు తమని రక్షించమని కోరుతూ ఫోన్‌లు చేస్తున్నారన్నారు.

ఇదీ చదవండి..

పైలట్‌ వర్గం ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని