భాజపాలో చేరిన సువేందు అధికారి

తాజా వార్తలు

Updated : 19/12/2020 16:31 IST

భాజపాలో చేరిన సువేందు అధికారి

కోల్‌కతా: ఊహాగానాలకు తెరదించుతూ బెంగాల్‌ రాజకీయాల్లో కీలక నేత సువేందు అధికారి నేడు భారతీయ జనతా పార్టీలో చేరారు. మిడ్నాపూర్‌లో జరిగిన భాజపా బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సువేందుకు షా సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సువేందు మాట్లాడుతూ.. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీపై, సీఎం మమతా బెనర్జీపై విమర్శల వర్షం కురిపించారు. ఆత్మగౌరవానికి రాజీపడే చోట తాను ఉండలేనని, అందుకే టీఎంసీని వీడానని చెప్పారు. 

‘భాజపాలోకి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. ఈ పార్టీతో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. కానీ పార్టీలో చేరమని ఎవరూ అడగలేదు. రెండు దశాబ్దాల పాటు తృణమూల్‌తో ఉన్నా. కానీ టీఎంసీ నన్ను అవమానించింది. ఆత్మగౌరవానికి రాజీ పడలేను. అందుకే పార్టీని వీడాను. కానీ ఇప్పుడు నన్ను వెన్నుపోటుదారుడిగా టీఎంసీ చిత్రీకరిస్తోంది. మమతాబెనర్జీ ఎవరికి అమ్మ కాదు. మనందరికీ తల్లి ఆ భరతమాత ఒక్కరే’ అని అధికారి చెప్పుకొచ్చారు. భాజపా నుంచి లభించినంత ప్రేమాభిమానాలను టీఎంసీలో తాను ఎప్పుడూ పొందలేదని అన్నారు. తనకు కొవిడ్‌ సోకిన సమయంలో అమిత్‌ షా రెండుసార్లు ఫోన్‌ చేసి ఆరోగ్యం గురించి ఆరాతీసినట్లు చెప్పారు. తృణమూల్‌ హయాంలో బెంగాల్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమవుతోందని ఆయన ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలుపు తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

సువేందుతో పాటు మరో 9 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, మరో మాజీ ఎంపీ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. కాగా.. ఎమ్మెల్యేల్లో ఐదుగురు టీఎంసీ నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. మరికొద్ది నెలల్లో బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. తాజా పరిణామాలు తృణమూల్‌కు సవాల్‌గా మారుతున్నాయి. ఆయన పార్టీలో లోటు దీదీకి భారీ నష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

తృణమూల్‌పై సువేందు ప్రభావమెంత..

బెంగాల్‌లోని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌లో సువేందు అధికారి రవాణా శాఖ, నీటిపారుదల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో రెండు పర్యాయాలు (2009, 2014) తమ్లుక్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే, పార్టీలో నెలకొన్న వ్యవస్థాగతమైన నిర్ణయాలు, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆధిపత్యం నచ్చకపోవడంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. నవంబర్‌ 27న తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్‌ ధన్కర్‌కు లేఖలు పంపారు. అంతకముందే హూగ్లీ రివర్‌ బ్రిడ్జి కమిషనర్స్‌ ఛైర్మన్‌గా, హల్దియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌ పదవులకు సైతం రాజీనామా చేయడం స్థానికంగా కలకలం రేపింది. 2007లో నందిగ్రామ్‌ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది అధికారి కుటుంబమే. ఒకరకంగా ఆ ఉద్యమం వల్లే 2011లో వామపక్ష ప్రభుత్వం కుప్పకూలిపోయింది. సీపీఎంకు కంచుకోటగా ఉన్న జంగల్‌మహల్‌ ప్రాంతాన్ని తృణమూల్‌ వైపు తిప్పడంలో అధికారి కుటుంబానిదే కీలక పాత్ర. తూర్పు మిడ్నాపూర్‌ జిల్లాకు చెందిన  అధికారి.. ముర్షిదాబాద్‌, మాల్దా, పురూలియా, బంకురాలలో రాజకీయంగా అధిక ప్రభావం చూపగలిగిన నాయకుడు. ఈ జిల్లాల్లోనే తృణమూల్‌ కాంగ్రెస్‌కు గట్టి పునాదులు ఏర్పడేందుకు ఆయన క్షేత్రస్థాయిలో విశేషంగా పనిచేశారు. జంగల్‌ మహల్‌ ప్రాంతంలో దాదాపు 40కి పైగా స్థానాల్లో (మొత్తం అసెంబ్లీ స్థానాలు 294) అధికారి కుటుంబానికి మంచి పట్టుంది. 

ఇప్పుడు ఆయన భాజపాలో చేరడంతో ఈ స్థానాల్లో తృణమూల్‌ నెగ్గుకురావడం కాస్త కష్టమనే విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే  ఆయన స్థానాన్ని భర్తీ చేసే బలమైన నాయకుడు టీఎంసీలో లేకపోవడం ఆ పార్టీకి ప్రతికూలాంశం. మరి సువేందు లేకుండా దీదీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ కొడతారో లేదో వేచి చూడాల్సిందే..!

ఇదీ చదవండి..

మిషన్‌ బెంగాల్‌: అమిత్ షా బిజీబిజీ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని