నితీశ్‌ సీఎం అయితే.. ఆ క్రెడిట్‌ శివసేనదే

తాజా వార్తలు

Published : 11/11/2020 12:10 IST

నితీశ్‌ సీఎం అయితే.. ఆ క్రెడిట్‌ శివసేనదే

ముంబయి: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ ఆ పార్టీ నేత నితీశ్‌ కుమార్‌ మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపడితే ఆ క్రెడిట్‌ తమకే దక్కుతుందని శివసేన పార్టీ పేర్కొంది. ఈ మేరకు తమ అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో బిహార్‌ ఫలితాల గురించి ప్రస్తావించింది. ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌.. ఎన్డీయేకు గట్టిపోటీ ఇచ్చారని తెలిపింది. జాతీయ రాజకీయాలకు కొత్త నాయకుడు వస్తున్నాడని తేజస్వీని ప్రశంసించింది. 

‘జేడీయూ పార్టీ తక్కువ స్థానాలు గెలుచుకున్నా కూడా నితీశ్‌ కుమారే ముఖ్యమంత్రి అవుతారని భాజపా నేత అమిత్ షా ఎన్నికల ముందు ప్రకటించారు. 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ భాజపా.. శివసేనకు ఇలాంటి హామీనే ఇచ్చింది. కానీ ఫలితాల తర్వాత కాషాయ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. ఫలితంగా రాష్ట్రంలో రాజకీయ మహాభారతం చోటుచేసుకుంది. ఇప్పుడు తాజాగా బిహార్‌ ఎన్నికల ఫలితాల్లో జేడీయూకు భాజపా కంటే తక్కువ సీట్లు వచ్చాయి. అయినప్పటికీ ఒకవేళ నితీశ్ కుమార్‌ సీఎం అయితే గనుక ఆ క్రెడిట్ తప్పకుండా శివసేనకే దక్కుతుంది’ అని శివసేన ఆ కథనంలో పేర్కొంది. మహారాష్ట్ర అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని భాజపా.. నితీశ్‌కు రాష్ట్ర పగ్గాలు ఇవ్వొచ్చని శివసేన అభిప్రాయం వ్యక్తం చేసింది. 

ఈ సందర్భంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై శివసేన ప్రశంసలు కురిపించింది. మహాకూటమిని ఒంటిచేత్తో నడిపించిన తేజస్వీ.. ఎన్డీయే కూటమికి గట్టి పోటీ ఇచ్చారని పేర్కొంది. బిహార్‌లో మోదీ ఛరిష్మా పనిచేసిందంటే తేజస్వీకి అన్యాయం చేసినట్లేనని, ఆ యువనేత వల్లే ఎన్నికల పోరు హోరాహోరీగా మారిందని అభిప్రాయపడింది. ‘నరేంద్రమోదీ తేజస్వీని జంగిల్‌ రాజ్‌కు వారసుడన్నారు. నితీశ్‌కుమార్‌ ఇవే నా చివరి ఎన్నికలంటూ సానుభూతి పొందారు. కానీ తేజస్వీ.. అభివృద్ధి, ఉపాధి, ఆరోగ్యం, విద్య వంటి సామాజిక అంశాలపై గళమెత్తారు’ అని సేన ప్రశంసించింది. ఈ ఎన్నికలు తేజస్వీ లాంటి ఓ కొత్త నేతను జాతీయ రాజకీయాలకు అందించాయని కొనియాడింది. ఇక కాంగ్రెస్‌ వైఫల్యమే తేజస్వీ అవకాశాలను దెబ్బతీసిందని శివసేన ఆరోపించింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని