‘ఓటింగ్‌కు వెళ్లకు.. కరోనా వచ్చిందని చెప్పు’

తాజా వార్తలు

Published : 25/11/2020 12:52 IST

‘ఓటింగ్‌కు వెళ్లకు.. కరోనా వచ్చిందని చెప్పు’

బిహార్‌ స్పీకర్‌ ఎన్నికకు ముందు లాలూ ఆడియోక్లిప్‌ వివాదం

ఎన్డీయే ఎమ్మెల్యేలను ఆశపెడుతున్నారన్న సుశీల్‌ మోదీ

పట్నా: మరికొద్ది గంటల్లో బిహార్‌ అసెంబ్లీలో స్పీకర్‌ పదవికి ఎన్నికలు జరగనుండగా.. రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌  వివాదాస్పద ఆడియో క్లిప్‌ ఒకటి బయటికొచ్చింది. అధికార ఎన్డీయే ఎమ్మెల్యేలను లాలూ ఆకర్షిస్తున్నట్లుగా ఉన్న ఆ ఆడియో క్లిప్‌ను బిహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘లాలూ నిజస్వరూపం ఇది. స్పీకర్‌ ఎన్నికలో మహాగట్‌ బంధన్‌కు మద్దతివ్వాలని ఎన్డీయే ఎమ్మెల్యేలను ఆయన ప్రలోభపెడుతున్నారు’ అని సుశీల్‌ మోదీ దుయ్యబట్టారు. 

అంతేగాక, లాలూ యాదవ్‌ నుంచి వచ్చిన ఫోన్‌ నంబరును కూడా సుశీల్‌ మోదీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘రాంచీ నుంచి లాలూ ఎన్డీయే ఎమ్మెల్యేలకు ఫోన్‌ చేసి మంత్రి పదవుల ఆశచూపుతున్నారు. నేను తిరిగి ఆ నంబరుకు ఫోన్‌ చేస్తే నేరుగా లాలూనే లిఫ్ట్‌ చేశారు. జైల్లో కూర్చుని ఇలాంటి ట్రిక్స్‌కు పాల్పడకండి. మీకు ఎలాంటి ఫలితం ఉండదని నేను ఆయనకు చెప్పాను’ అని సుశీల్‌ మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

లాలూ మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఆ ఆడియో క్లిప్‌ ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త వివాదానికి తెరతీసింది. అందులో ఆర్జేడీ అధినేత.. ఓ భాజపా ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి ‘రేపటి స్పీకర్‌ ఎన్నికలో మీరు మాకు మద్దతిస్తే మీకు మంత్రి పదవి ఇస్తాం. ఎన్నికకు వెళ్లకండి. కరోనా వచ్చిందని చెప్పండి. మీరు మద్దతిస్తే స్పీకర్‌ పదవి మా పార్టీకి వస్తుంది. అప్పుడు మీకోసం ఏదైనా చేస్తాం’ అని చెప్పినట్లుగా ఉంది. అయితే ఈ క్లిప్‌లో మాట్లాడుతున్నది నిజంగా లాలూయేనా అనే విషయం తేలలేదు. 

బిహార్‌లో దాదాపు 50ఏళ్ల తర్వాత స్పీకర్‌ పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్డీయే కూటమి తరఫున విజయ్‌ కుమార్‌ సిన్హా, మహాకూటమి తరఫున అవద్‌ బిహారీ చౌధరి పోటీలో ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 126 ఓట్లు రాగా.. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి 110 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ లెక్కల ప్రకారం స్పీకర్‌ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేనప్పటికీ ఓటింగ్‌కు అధికార ఎమ్మెల్యేలను దూరంగా ఉంచి స్పీకర్‌ పదవి దక్కించుకోవాలని ఆర్జేడీ ప్రయత్నిస్తోందని భాజపా ఆరోపిస్తోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని