ఏపీలోనూ అదే పరిస్థితి రానుంది: రఘురామ

తాజా వార్తలు

Published : 30/10/2020 01:23 IST

ఏపీలోనూ అదే పరిస్థితి రానుంది: రఘురామ

దిల్లీ: పొరుగు రాష్ట్రం నుంచి నాణ్యమైన మద్యాన్ని తెచ్చుకునే ప్రజలను ఏపీ ప్రభుత్వం కేసుల పేరుతో వేధించడం సరికాదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. దొంగ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతోందని.. అనధికార బెల్ట్‌షాపులు ఎక్కువయ్యాయని ఆయన ఆరోపించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల శ్రమను కొంతమంది మద్యం వ్యాపారులు దోచుకుంటున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. బిహార్‌లో సంపూర్ణ మద్య నిషేధంతో మద్యం అమ్మకాలు తగ్గకపోగా.. సరఫరా ఎక్కువైందని చెప్పారు. తలసరి ఆదాయం తక్కువ గల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ముఖ్యంగా మహిళలు ప్రస్తుత ప్రభుత్వానికి ఓటు వేయవద్దని నిర్ణయించుకున్నారని రఘురామకృష్ణరాజు వివరించారు. ఏపీలోనూ రానున్న రోజుల్లో ప్రభుత్వానికి అదే పరిస్థితి ఎదురుకానుందన్నారు. 

సంపూర్ణ మద్య నిషేధం దేశంలో ఎక్కడా సాధ్యం కాదని రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. కల్తీ మద్యం, తక్కువ రకం బ్రాండ్లతో ప్రజల రక్తం తాగే వ్యాపారులపై సీఎం జగన్‌ చర్యలు తీసుకోవాలన్నారు. ముగ్గురు వ్యక్తుల మద్యం వ్యాపారాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత మద్యం విధానం ఉపయోగపడుతోందని ఆరోపించారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు ప్రత్యేక విమానంలో ఎంపీలను పంపారని.. అదే పని రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం ఇచ్చిన హామీల సాధనకు పంపితే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అగ్రకుల పేదలకు కేంద్రం ఇచ్చిన పదిశాతం రిజర్వేషన్‌ను సీఎం జగన్‌ అమలు చేయాలని సూచించారు. వేంకటేశ్వరస్వామి గడప.. కడప పేరును ఓ పత్రిక నామరూపాల్లేకుండా చేస్తోందని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని