జూటా మాటలు వద్దు: హరీశ్‌రావు

తాజా వార్తలు

Published : 31/10/2020 01:17 IST

జూటా మాటలు వద్దు: హరీశ్‌రావు

సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో భాజపా నేతలు జూటా మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపన్యాసాలు, కరపత్రాలు, సామాజిక మాధ్యమాల్లో గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి హరీశ్‌రావు.. భాజపాపై విమర్శనాస్త్రాలు సంధించారు. భాజపా నేతల ఇళ్లలో డబ్బులు దొరికితే, పోలీసులే డబ్బు పెట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ఆ పార్టీ నేతలకు అసలు ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించారని ఆరోపించారు. అబద్ధాల పునాదులపై దుబ్బాకలో గెలవాలని భాజపా ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణకు ఉపయోగపడే ఒక్క ప్రాజెక్టునైనా భాజపా నేతలు తీసుకొచ్చారా? నిజామాబాద్‌లో గెలిస్తే పసుపు బోర్డు తీసుకొస్తామని బాండు పేపర్లు ఇచ్చారు కదా.. మరి ఇప్పటివరకు ఎందుకు తేలేకపోయారని హరీశ్‌రావు ప్రశ్నించారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై ఇస్తున్న గొర్రెల యూనిట్‌ ధర ఎంతో కూడా భాజపా నేతలకు కనీస అవగాహన లేదు. గొర్రెల పథకంలో ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానిది లేదు. రేషన్‌ బియ్యం రాయితీలో రూ.29 కేంద్రం ఇస్తుందని.. తెరాస ప్రభుత్వం కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఇస్తుందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దుబ్బాకకు పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరైతే నేను సిద్దిపేటకు తీసుకెళ్లినట్లు దుష్ప్రచారం చేశారు. విద్యుత్‌ విషయంలో కూడా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. రైతులకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వ్యవసాయ పంపుసెట్లకు కేసీఆర్‌ మీటర్లు పెడుతున్నారని, ధాన్యం కొనుగోలుకు రూ. 5,500 కోట్లు ఇచ్చామని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు’’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే మూడేళ్లలో తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. దుబ్బాక ప్రజలు చైతన్యవంతులని.. తప్పకుండా వారి ఓట్లతో భాజపాకు బుద్ధి చెబుతారని హరీశ్‌రావు అన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని