సమస్యలుంటే పెట్టుబడులు వస్తాయా?: హరీశ్‌

తాజా వార్తలు

Published : 27/11/2020 01:06 IST

సమస్యలుంటే పెట్టుబడులు వస్తాయా?: హరీశ్‌

హైదరాబాద్: కరోనా వల్ల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఆలస్యమైందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇళ్లు లేని పేదలకు త్వరలోనే రెండు పడకగదుల ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. నగరంలోని భారతీనగర్‌ డివిజన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. తెరాస అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ నల్లా పెట్టి తాగునీరు అందిస్తున్నామన్నారు. ఇప్పుడు నల్లా బిల్లులు కూడా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు ఎక్కడా లేవని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వరద సాయం అందిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని హరీశ్‌రావు మండిపడ్డారు. ఎన్నికల తర్వాత వరద సాయం అందిస్తామని స్పష్టం చేశారు. వరద సాయం అందని ప్రతి ఒక్కరికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రశాంత హైదరాబాద్‌ కావాలా? లేక విధ్వంస హైదరాబాద్‌ కావాలా? ప్రజలే తేల్చుకోవాలన్నారు. తెరాసతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

‘‘బీహెచ్‌ఈఎల్‌ సంస్థకు రూ.40 వేల కోట్ల ఆర్డర్‌ ఇచ్చింది సీఎం కేసీఆర్‌. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడే బాధ్యత కేసీఆర్‌ తీసుకుంటున్నారు. సీఎంతో మాట్లాడి ఆసరా పథకం ద్వారా బీహెచ్‌ఈఎల్‌ విశ్రాంత ఉద్యోగులకు పింఛన్‌ ఇప్పిస్తాం. అమెజాన్‌ కంపెనీ హైదరాబాద్‌లో రూ.21వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఉస్మాన్‌సాగర్‌లో ఐటీ పార్క్‌, సుల్తాన్‌పూర్‌లో మెడికల్‌ డివైస్‌ పార్క్‌ వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రాష్ట్ర అభివృద్ధిని చూసే హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తున్నాయి. నగరంలో శాంతి భద్రతల సమస్యలు ఉంటే పెట్టుబడులు ఎందుకు వస్తాయి?కరోనా, భారీ వరదల సమయంలో ప్రజలకు అండగా ఉన్నది తెరాస మాత్రమే’’ అని హరీశ్‌రావు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని