పథకాలు అందుకుంటూనే ఇవ్వలేదంటే ఎలా?: హరీశ్‌రావు

తాజా వార్తలు

Published : 02/11/2020 00:54 IST

పథకాలు అందుకుంటూనే ఇవ్వలేదంటే ఎలా?: హరీశ్‌రావు

దుబ్బాక: ‘‘దుబ్బాక నియోజకవర్గంలో తెరాస చాలా బలమైన పార్టీ. నిన్నటి వరకు దుబ్బాకలో కొన్ని పార్టీలు పరాయి నాయకులు.. కిరాయి కార్యకర్తలతో ప్రచారం చేశారు. ఇవాళ్టితో మొత్తం ఖాళీ అయింది. నేటి నుంచి దుబ్బాకలో ఇక్కడి మట్టి బిడ్డలు మాత్రమే ఉంటారు. సీఎం కేసీఆర్‌కు దుబ్బాక మట్టి పరిమళం తెలుసు’’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దుబ్బాకలో ఆయన మీడియాతో మాట్లాడారు. పనిమంతులు కావాలా.. రాజకీయాలు చేసేవారు కావాలా..? అనే విషయాన్ని దుబ్బాక ప్రజలందరూ ఆలోచించాలని కోరారు. తెరాసకు ప్రజలే హైకమాండ్‌ అని.. పనిమంతులను గుర్తించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రైతు బంధువులు ఎవరో.. రాబందులు ఎవరో ప్రజలే తేల్చుకోవాలన్నారు.

‘‘రైతు బంధు, కేసీఆర్ కిట్‌, కల్యాణ లక్ష్మి, గోదావరి, కాళేశ్వరం నీళ్లు ఇచ్చిందెవరో ప్రజలు గుర్తించాలి. ఓటేసే ముందు ప్రభుత్వ పథకాల గురించి ఒకసారి ఆలోచించండి. భాజపా అభ్యర్థి రఘునందన్ రావు ఇంట్లో 5 తెరాస ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఆయన తండ్రికి ఆసరా పింఛన్‌, వారి కుటుంబంలోని ముగ్గురికి రైతుబంధు నగదు పంటపంటకూ పడుతుంది. ఇంటికి మిషన్‌ భగీరథ నీరు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, రూపాయికి కిలో బియ్యం పొందుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నారు. దేశంలో భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు, 24 గంటల నిరంతర విద్యుత్‌ అమల్లో లేదు. ఇలా అభివృద్ధి పథకాలు అందుకుంటూనే రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదని తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదు. పథకాలు తీసుకుని కేసీఆర్‌ ఇవ్వలేదంటే.. భాజపా వారిని ఆ దేవుడు కూడా క్షమించడు’’ అని హరీశ్‌రావు ఆక్షేపించారు.

తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని గతంలో జరిగిన ప్రగతితో పోల్చి చూసిన తర్వాతే ఓటు వేయాలని మంత్రి సూచించారు. తెరాస అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి.. హుజూర్‌నగర్ తరహా ప్యాకేజీ పొందుదామన్నారు. భాజపా, కాంగ్రెస్ నేతల ఫిర్యాదులతో తెరాసకు చెందిన 16మంది నాయకుల ఇళ్లపై దాడులు జరిగితే.. ఒక్కరి ఇంట్లో కూడా అక్రమ నగదు దొరకలేదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా హైదరాబాద్‌లో కుట్రలకు భాజపా పన్నాగం పన్నుతోందని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లు, తప్పుడు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సరైన అభ్యర్థిని ఎంచుకొని ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి..

హైదరాబాద్‌లో అల్లర్లకు భాజపా కుట్ర: కేటీఆర్‌

బండి సంజయ్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ

కేసీఆర్‌ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు: లక్ష్మణ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని