ఎవరికోసం ఆ దారుణాన్ని దాచిపెట్టారు: రాహుల్

తాజా వార్తలు

Updated : 18/11/2020 04:33 IST

ఎవరికోసం ఆ దారుణాన్ని దాచిపెట్టారు: రాహుల్

దిల్లీ: రాజకీయ లబ్ధి కోసం అమానవీయ ఘటనను వెలుగులోకి రాకుండా అడ్డుకున్నారని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌పై  కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతింటామనే భయంతో  వైశాలి ప్రాంతంలో 20 ఏళ్ల యువతికి జరిగిన దారుణాన్ని దాచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని ట్విటర్‌లో షేర్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో సజీవ దహన ఘటనను వెలుగులోకి రానీయలేదని, 15 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితురాలు మరణించిందని ఆ కథనం పేర్కొంది. ‘ఎవరి నేరం అత్యంత ప్రమాదకరమైంది? ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారు? లేక ఎవరు తన తప్పుడు సుపరిపాలన కోసం రాజకీయ లబ్ధి పొందేందుకు దీన్ని దాచిపెట్టారు?’ అంటూ రాహుల్‌ ట్వీట్ చేశారు. 

వైశాలి పరిధిలోని హాజిపూర్‌కు చెందిన ఓ మతవర్గానికి చెందిన 20 ఏళ్ల యువతిని అదే ప్రాంతానికి చెందిన కొందరు యువకులు వేధించేవారు. ఆమె వారి తీరును తీవ్రంగా వ్యతిరేకించడంతో, ఆ నిందితులు ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. అక్టోబర్ 30న ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు పట్నా వైద్య కళాశాల, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పోలీసులు ఆమె స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. అవి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన అనంతరం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం గమనార్హం. అయితే, రెండు వారాల చికిత్స అనంతరం నవంబర్‌ 15న ఆ బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. దాంతో ఆ నిందితులను అరెస్టు చేయాలంటూ మృతురాలి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఒకరిని అరెస్టు చేయగా, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని