2020లో భాజపా ప్రయత్నాలన్నీ విఫలం 

తాజా వార్తలు

Updated : 30/12/2020 23:44 IST

2020లో భాజపా ప్రయత్నాలన్నీ విఫలం 

 

శివసేన  

ముంబయి: దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయాలనే భ్రమ నుంచి భాజపా బయటకు రావాలని శివసేన పేర్కొంది. ఇకముందూ అలాంటి మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని ఘాటు హెచ్చరికలు చేసింది. ఈ మేరకు శివసేన తన అధికార పత్రిక సామ్నాలో భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఈడీ వంటి సంస్థలను ఉపయోగించాలనే మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి. ఇలాంటి చర్యల వల్ల ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు వేగంగా క్షీణిస్తున్నాయి’ అని శివసేన విమర్శించింది. 

‘ఉద్ధవ్‌ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 2020లో మీరు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రాష్ట్ర గవర్నర్‌ కోరుకునే ప్రభుత్వం ఇంకా 25 ఏళ్లు గడిచినా రాదు. ఈడీని ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకునే భ్రమ నుంచి ఇకనైనా భాజపా బయటకు రావాలి. ఇటీవల భాజపా నుంచి బయటకు వచ్చిన ఏక్‌నాథ్‌ ఖడ్సేకు సైతం ఈడీ నుంచి నోటీసులు పంపారు. ఇలా ఎన్సీపీ నేత శరద్‌పవార్‌, శివసేన నేత ప్రతాప్‌ సర్నాయక్‌ ఇంకా పలువురు నాయకులపై ఈడీ దాడులు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి’ అని శివసేన భాజపాపై మండిపడింది.  

‘సంజయ్‌రౌత్‌కు రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదా అని భాజపా నేత చంద్రకాంత్‌ పాటిల్‌ అడుగుతున్నారు. మరి పాటిల్‌కు రాజ్యాంగం పట్ల అంత గౌరవం ఉంటే.. అదే ప్రశ్న రాష్ట్ర గవర్నర్‌ కోశ్యారీకి వేయండి. గవర్నర్‌ కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపినప్పటికీ ఎందుకు భర్తీ చేయడం లేదని గవర్నర్‌ను ప్రశ్నించండి’ అని శివసేన దీటుగా బదులిచ్చింది. 

ఇటీవల శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ భార్య వర్షకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. పీఎంసీ బ్యాంకు కుంభకోణం కేసులో ఆమెకు సంబంధాలున్నట్లు ఈడీ నోటీసుల్లో పేర్కొంది. కాగా ఆమె డిసెంబర్‌ 29న విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. వెళ్లకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఇటీవల భాజపాకు రాజీనామా చేసి ఎన్సీపీలో చేరిన ఏక్‌నాథ్‌ ఖడ్సేకు సైతం మనీ లాండరింగ్‌ కేసులో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ ఈడీ నోటీసులు జారీ చేసింది. మరో శివసేన ఎమ్మెల్యే ప్రతాప్‌ సర్నాయక్‌ ఇంటిపైనా దాడులు చేసింది. 

ఇదీ చదవండి

కొవిషీల్డ్‌కు నేడు అనుమతులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని