దీదీకి మరో షాక్‌..!

తాజా వార్తలు

Published : 18/12/2020 02:13 IST

దీదీకి మరో షాక్‌..!

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ అక్కడి రాజకీయం వేడెక్కుతోంది. అధికార తృణమూల్‌  కాంగ్రెస్‌ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి వీడ్కోలు చెబుతున్నారు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే జితేంద్ర తివారీ, అసన్‌సోల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాలకమండలి ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. సంస్థాగత సమస్యలను హైకమాండ్‌ సకాలంలో పరిష్కరించలేకపోవడంతోనే పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రాంతమైన అసన్‌సోల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, దీంతో కేంద్రం ద్వారా వచ్చే నిధులు కోల్పోతోందని కొన్ని రోజుల క్రితం మున్సిపల్‌ శాఖ మంత్రి ఫిర్హాద్ హకీంనకు ఆయన లేఖ రాశారు. దీనిపై ‘ఎలాంటి స్పందన రాలేదు. ప్రజలకు సేవ చేయలేనప్పుడు ఈ పదవి ఎందుకు..? అందుకే రాజీనామా చేశాను’ అని తివారీ అన్నారు. శుక్రవారం ఆయన కోల్‌కతాలో మమతా బెనర్జీని కలిసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. సువేందు నిర్ణయాన్ని తివారీ ప్రశంసించారు.

మరోవైపు తృణమూల్‌లో మమతా బెనర్జీ తర్వాతి స్థానంలో ఉన్న నాయకుడిగా పేరున్న సువేందు అధికారి బుధవారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మమతతో తీవ్రంగా విభేదించిన ఆయన గత నెలలో మంత్రి పదవిని కూడా వదులుకున్నారు. తాజాగా టీఎంసీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు పార్టీకి సంబంధించిన అన్ని హోదాల నుంచి ఆయన వైదొలిగారు. ఇదే విషయం జితేంద్ర తివారీ, ఇతర అసమ్మతి నేతలతో కలిసి ఆపార్టీ ఎంపీ సునీల్‌ మండల్‌కు వివరించారు. కాగా..శనివారం మిడ్నాపూర్‌లో భాజపా నిర్వహించనున్న కార్యక్రమంలో అమిత్‌ షా సమక్షంలో సువేందు కమలం కండువా కప్పుకోనున్నారని ఆయన మద్దతుదారులు తెలిపారు. మరో సీనియర్‌ నాయకుడు దీప్తంగ్షు చౌదరి కూడా దక్షిణ బెంగాల్ రాష్ట్ర రవాణా సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తృణముల్‌‌ నేతల రాజీనామా నిర్ణయాన్ని ప్రశంసించిన భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌..‘ఇది అధికార తృణముల్‌ కాంగ్రెస్‌కు ముగింపునకు నాంది. ఇప్పుడు ఆ పార్టీ పేకమేడలా కూలిపోతుంది’ అని పేర్కొన్నారు. కాగా.. త్వరలోనే తృణముల్‌ కాంగ్రెస్‌కు చెందిన మరికొందరు నేతలు పార్టీని వీడి భాజపాలో చేరనున్నట్లు సమాచారం. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని