BS Yadiyurappa: సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా 

తాజా వార్తలు

Updated : 26/07/2021 13:51 IST

BS Yadiyurappa: సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా 

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో నెలకొన్న నాటకీయతకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగనుంది. ముఖ్యమంత్రి పదవి నుంచి బీఎస్‌ యడియూరప్ప తప్పుకొంటున్నారు. ఈ విషయాన్ని సోమవారం యడ్డీ స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత గవర్నర్‌ కార్యాలయానికి వెళ్లి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన రోజే యడియూరప్ప రాజీనామా చేస్తుండటం గమనార్హం. 

భావోద్వేగానికి గురైన యడ్డీ..

కర్ణాటక ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యడియూరప్ప మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘నా రాజకీయ జీవితంలో ప్రతిక్షణం అగ్నిపరీక్షే. కొవిడ్‌ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. అయినా రెండేళ్ల పాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా ముందుకు నడిపా. ఈ అవకాశం ఇచ్చిన కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మాజీ ప్రధాని వాజ్‌పేయీ కేంద్రంలో మంత్రిపదవి ఇస్తానని చెప్పారు. కానీ నేను కర్ణాటకలోనే ఉంటానని ఆయనకు చెప్పా. ఈ ప్రజలకు నేను ఎంతగానో రుణపడి ఉన్నా’’ అని యడ్డీ కన్నీళ్లుపెట్టుకున్నారు.

తాను ఎలాంటి ఒత్తిడి, బాధతో రాజీనామా చేయడం లేదని, రెండేళ్ల ఒప్పందంతోనే మోదీ, అమిత్ షా, నడ్డా తనకు సీఎం పదవి ఇచ్చారని యడియూరప్ప చెప్పారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. 

అధిష్ఠానం ఆదేశాలతోనే..

కర్ణాటకలో నాయకత్వ మార్పుపై గత కొద్ది రోజులుగా అనేక ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే వీటిపై ఎప్పటికప్పుడు సున్నితంగా స్పందించిన యడియూరప్ప.. పార్టీ అధినాయకత్వం ఆదేశాలను తాను పాటిస్తానని మాత్రం స్పష్టంగా చెప్పారు. అధికారంలో ఉన్నా లేకపోయినా మరో 10-15 ఏళ్లపాటు పార్టీ అభివృద్ధికి కృషిచేస్తానని పేర్కొన్నారు. భాజపా అధిష్ఠానం ఆదేశాలతోనే తాజాగా ఆయన రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది.

రెండేళ్లలో ఎన్నో ఆటుపోట్లు

78ఏళ్ల యడియూరప్ప 2019 జులై 26న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ రెండేళ్లలోనే ఆయన ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. వర్షాలు, వరదలు, కరోనా తెచ్చిన సంక్షోభం..ఇలా అనేక సమయాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై విపక్షాలు పదేపదే విమర్శించటం భాజపా సర్కారును ఇరుకునపడేసింది. ఇదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటులో రెండో శ్రేణి నేతల సహకారాన్ని గుర్తించిన అధిష్ఠానం.. కొత్త నాయకత్వం వైపు దృష్టిపెట్టింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని