ఉద్ధవ్‌జీ.. లౌకికవాదిగా మారారా?

తాజా వార్తలు

Published : 13/10/2020 16:28 IST

ఉద్ధవ్‌జీ.. లౌకికవాదిగా మారారా?

మహా గవర్నర్‌ ప్రశ్నలు.. ఠాక్రే ఘాటు సమాధానాలు

ముంబయి: ఆలయాలు, ఇతర ప్రార్థనామందిరాలను తెరిచే అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ మధ్య వాడీవేడీ లేఖలయుద్ధం జరిగింది. ‘సీఎంజీ ఒక్కసారిగా లౌకికవాదిగా మారిపోయారా?’ అని గవర్నర్‌ వ్యంగ్యబాణాలు విసరగా.. ‘నాకెవరూ హిందుత్వ సర్టిఫికేట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు’ అంటూ ఠాక్రే ఘాటు సమాధానాలు చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో ఆలయాలు, ప్రార్థనామందిరాలను ఈ ఏడాది మార్చి నుంచి మూసివేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగైనందున వాటిని తెరిచే అంశంపై నిర్ణయం తీసుకోవాలంటూ గవర్నర్‌ కోశ్యారీ.. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు సోమవారం లేఖ రాశారు. ఈ సందర్భంగా సీఎంపై గవర్నర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మీరు బలమైన హిందుత్వ వాది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అయోధ్యను సందర్శించి శ్రీరాముడిపై మీకున్న భక్తిని చాటుకున్నారు. విఠల్ రుక్మిణి మందిరంలో పూజలు కూడా చేశారు. అలాంటి మీరు రాష్ట్రంలో ప్రార్థనామందిరాలను మాత్రం ఇంకా తెరవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బార్లు, రెస్టారెంట్లు, బీచ్‌లను తెరిచారు. కానీ దేవుళ్లను లాక్‌డౌన్‌లో ఉంచారు. ఇలా చేయమని భగవంతుడి నుంచి మీకేమైనా ఆదేశాలు వచ్చాయా? లేదా మీరే లౌకికవాదిగా మారారా?’ అని కోశ్యారీ లేఖలో ప్రశ్నించారు.

కాగా.. ఇందుకు ఉద్ధవ్‌ ఠాక్రే దీటుగా సమాధానమిచ్చారు. ‘నాకెవరూ హిందుత్వ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రార్థనమందిరాలు తెరిస్తే హిందుత్వవాది.. తెరవకపోతే లౌకికవాది అని గవర్నర్‌ చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. లౌకికవాదం అనేది రాజ్యాంగంలోని కీలకమైన అంశం. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మీరు ఆ విషయాన్ని మర్చిపోయారా? ఇక నాకేదో భగవంతుడి నుంచి ఆదేశాలు వచ్చాయా అని అడిగారు కదా..! అలాంటివి మీకు వస్తాయేమో. నేను అంత గొప్పవాడిని కాదు’ అని ఠాక్రే ప్రత్యుత్తరం పంపారు. 

ప్రజల మత విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు వారి ప్రాణాలకు రక్షణ కల్పించడం కూడా ముఖ్యం అని, లౌక్‌డౌన్‌ను ఉన్నట్టుండి ఎత్తివేయడం సరికాదని ఠాక్రే తన లేఖలో పేర్కొన్నారు. కొవిడ్‌ పరిస్థితులను సమీక్షించిన తర్వాత ప్రార్థనామందిరాలను తెరవడంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టంగా చెప్పారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని